సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తిరుపతి పర్యటనకు వస్తే ప్రభుత్వపరంగా ప్రోటోకాల్ కూడా పాటించకపోవటం సభ్యతేనా అని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి నిలదీశారు. ప్రభుత్వపరంగా గౌరవం ఇవ్వకుండా పైపెచ్చు ప్రతిపక్షాలను నిందించటం దుష్టరాజకీయమని బుచ్చయ్య చౌదరి ధ్వజమెత్తారు. ఇది ఆమోదయోగ్యమైన విషయమేనా అని గోరంట్ల ప్రశ్నించారు. గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకుంటున్నట్లు వైకాపా నేతల వ్యవహరం ఉందని దుయ్యబట్టారు. తెలుగువాడు గర్వపడేలా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కావటం గర్వకారణమని తెలుగుజాతి చెప్పుకుంటోందని గుర్తు చేశారు.
'జుట్టు' పన్నుకూ ప్రజలు సిద్ధం కావాలి: మాజీ మంత్రి జవహర్
పాలనలో తుగ్లక్‌ను, పన్నుల వసూళ్లలో కుతుబుద్దీన్ ఐబక్ చరిత్రను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్నారని మాజీ మంత్రి జవహర్ దుయ్యబట్టారు. ప్రజలపై ఇప్పటికే నీరు, ఆస్తి, విలువ ఆధారిత పన్నుల భారం మోపగా.. ఇక మిగిలిన 'జుట్టు' పన్నుకూ ప్రజలు సిద్ధం కావాలని మండిపడ్డారు. బెయిల్ రద్దుపై ఉన్న శ్రద్ధ రాష్ట్ర సమస్యలపై లేదని విమర్శించారు.