ప్రభుత్వ మాట విననందుకు కృష్ణా జిల్లాలో బ్యాంకు కార్యాలయాల వెలుపల అధికారులు చెత్తపోసి రాష్ట్ర ప్రతిష్ఠను దెబ్బతీశారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ఈ ఘటన తనను షాక్‌కు గురి చేసిందని అన్నారు. ఈ నీచమైన చర్య రాష్ట్ర కీర్తి, పేరు ప్రతిష్ఠలపై ప్రభావం చూపుతుందని దుయ్యబట్టారు. ఇలాంటి దారుణమైన అనాగరిక చర్యలతో రాష్ట్రం ఎటుపోతోందని ట్విటర్లో ప్రశ్నించారు. మరోవైపు వివిధ ప్రకటనలలో వైకాపా సర్కార్‌పై ప్రతిపక్ష పార్టీ నేతలు విమర్శలు గుప్పించారు.
చెత్త పాలన అని మరోసారి నిరూపించుకున్నారు
బెదిరించేందుకు బ్యాంకు కార్యాలయాల ముందు చెత్తపోసి జగన్ రెడ్డిది చెత్త పాలన అని మరోసారి నిరూపించుకున్నారు. సీఎం బెదిరింపులకి రాష్ట్రానికి 200 సంస్థలు గుడ్ బై చెప్పాయి. ఇలాంటి చెత్త చర్యలతో బ్యాంకులు కూడా బై బై చెప్పడం ఖాయం. చెత్త పోసి బ్యాంకులను భయపెట్టిన చెత్త సీఎంగా జగన్ రెడ్డి దేశ చరిత్రలో నిలిచిపోతారు- అయ్యన్నపాత్రుడు, తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు
సీఎం, మంత్రుల ఇళ్ల ముందు చెత్త వేయాలి
నివాస యోగ్యం కాని స్థలాలు ఇస్తున్నందుకు సీఎం జగన్, మంత్రుల ఇళ్ల ముందు చెత్త వేయాలి. అక్రమ రుణాలు ఇవ్వలేదని బ్యాంకుల ముందు చెత్త వేసే బదులు బీసీ నాయకుల విగ్రహాలు లేకుండా చేస్తామన్న మంత్రుల ఇళ్ల ముందు చెత్త వేయాలి. స్వాతంత్ర సమరయోధులు గౌతు లచ్చన్న విగ్రహంపై మంత్రి సీదిరి అప్పల రాజు చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోకుంటే రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేస్తాం. రాగ ద్వేషాలకు అతీతంగా పరిపాలిస్తామని రాజ్యంగంపై చేసిన ప్రమాణాన్ని అటకెక్కించారు. కులం బురదలో వైకాపా నేతలంతా కొట్టుమిట్టాడుతున్నారు- అనగాని సత్యప్రసాద్, రేపల్లె ఎమ్మెల్యే