తెలుగుదేశం పార్టీ తలపెట్టిన 'చలో ఆత్మకూరు' కార్యక్రమానికి వెళ్తున్న నేతలను, కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ నిర్బంధించారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్‌ను గృహనిర్బంధం చేశారు. ముఖ్యనాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. రామ్మోహన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందనీ.. ఎంతో మంది తెదేపా కార్యకర్తలను చంపేస్తున్నారని ఆరోపించారు. గుంటూరు జిల్లా చింతలపూడిలో మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ను ఆయన ఇంట్లోనే నిర్బంధం చేశారు. ప్రభుత్వం ప్రజాసమస్యలపై కాకుండా తమపై కక్ష పూర్వకంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
విజయవాడ పాత బస్తీ నుంచి ఆత్మకూరు బయలుదేరిన బుద్ధా వెంకన్నను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పం గొప్పదనీ.. అధికారంతో వైకాపా తమ ఉద్యమాన్ని అణచివేయలేదని బుద్ధా స్పష్టంచేశారు. ఆత్మకూరు బాధితులకు న్యాయం జరిగే వరకూ పోరాడతామన్నారు. కడప జిల్లాలో కనకమేడల రవీంద్రకుమార్‌ను, ఇతర నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. తాను కోర్టుకు వెళ్లాలనీ.. న్యాయస్థానానికి వెళ్లకుండా తనను అడ్డుకోవడం చట్ట ఉల్లంఘన అని మండిపడ్డారు.