అసెంబ్లీ ముట్టడికి యత్నించిన తెదేపా నేతలు అరెస్ట్
అమరావతి పరిరక్షణ ఐకాస పిలుపు మేరకు నిర్వహిస్తున్న చలో అసెంబ్లీని అడ్డుకునేందుకు.. ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం నేతలందరినీ ఎక్కడికక్కడ అరెస్టు చేశారు పోలీసులు.
అమరావతి పరిరక్షణ ఐకాస పిలుపు మేరకు నిర్వహిస్తున్న చలో అసెంబ్లీని అడ్డుకునేందుకు.. ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం నేతలందరినీ ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. నేతలందరినీ హౌస్ అరెస్టులు చేశారు. ఐకాస పిలుపు మేరకు తెదేపా, వామపక్షాలు అసెంబ్లీ ముట్టడిలో పాల్గొనేందుకు సిద్ధమయ్యాయి. రాజధాని గ్రామాల ప్రజలు కూడా చలో అసెంబ్లీకి సన్నద్దమయ్యారు. అయితే నేతలందరినీ జిల్లాల నుంచే బయటకు రాకుండా అడ్డుకున్నారు. ముఖ్యంగా తెదేపా మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలనూ ఇళ్లలో నుంచి బయటకు రానీయలేదు. రాష్ట్రవ్యాప్తంగా 82 నియోజకవర్గాల్లో తెదేపా నేతలను అడ్డుకున్నారు. విజయవాడలో ఎంపీ కేశినేని నానిని... పోలీసులు గృహనిర్బంధం చేశారు. పోలీసుల చర్యలను ఖండించిన కేశినేని నాని.... ఆంధ్రప్రదేశ్‌లో ఇది ఒక అసంఘటిత చర్య అని వ్యాఖ్యానించారు. విజయవాడ గొల్లపూడి సెంటర్‌లో... మాజీ మంత్రి దేవినేని ఉమ ఇంటి వద్ద ఉద్రిక్తత తలెత్తింది. అసెంబ్లీ ముట్టడికి వెళ్లకుండా ఉమను అరెస్టు చేసేందుకు పోలీసులు యత్నించగా.. స్థానికులు అడ్డుకున్నారు. తీవ్ర ఉద్రిక్తతల మధ్యనే ఉమను అరెస్టు చేసి ఠాణాకు తరలించారు. విజయవాడ నుంచి అసెంబ్లీ ముట్టడికి బయల్దేరిన ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నను అరెస్టు చేశారు. అనంతరం వ్యాన్‌లో ఎక్కించి అక్కడి నుంచి తరలించారు. నందిగామలో మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యను పోలీసులు అదుపులోకి తీసుకుని... స్టేషన్‌కు తరలించారు.