తెదేపా నేతల అరెస్టులకు నిరసగా రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు కాగడాల ప్రదర్శన చేపట్టారు. పార్టీ అధినేత చంద్రబాబు ఇచ్చిన పిలుపు మేరకు గుంటూరులో ఎంపీ గల్లా జయదేవ్, తెదేపా నేతలు నిరసన వ్యక్తం చేశారు. విశాఖలో ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ ఆధ్వర్యంలో కాగడాలను ప్రదర్శించారు. మాజీ ఎంపీ మాగంటి బాబు ఇంట్లో లాతరు వెలిగించి నిరసన తెలిపారు. ప్రభుత్వం అరెస్టు చేసిన అచ్చెన్నాయుడు, ప్రభాకర్ రెడ్డి, చింతమనేని వెంటనే విడుదల చేయాలని నేతలు డిమాండ్ చేశారు. విజయవాడలోని గొల్లపూడి నివాసంలో దేవినేని ఉమామహేశ్వరరావు కాగడాలతో నిరసన తెలిపారు. అధికారుల తీరుతో అచ్చెన్నాయుడికి మళ్లీ శస్త్రచికిత్స చేయాల్సిన పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు.
ప్రభుత్వం అరెస్ట్ చేసిన నేతలను విడుదల చేయాలి. ప్రభుత్వం వైఫల్యాలను ప్రశ్నించే అచ్చెన్నాయుడు కావాలని అరెస్ట్ చేశారు. అసెంబ్లీలో గొంతు వినిపించొద్దని ఇలా చేశారు. అర్ధరాత్రి అరెస్ట్ చేసి 24 గంటలు రోడ్లపై తిప్పారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే కేసుల పేరుతో వేధిస్తున్నారు. ఇలాంటి విధానం సరికాదు. వైకాపా ప్రభుత్వ తీరుతో ప్రజాస్వామ్యానికే ప్రమాదం ఉంది - గల్లా జయదేవ్, తెదేపా ఎంపీ