పరిషత్ ఎన్నికలు బహిష్కరించాలన్న పార్టీ నిర్ణయం శిరోధార్యమని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు స్పష్టం చేశారు. ప్రభుత్వ అప్రజాస్వామిక చర్యలకు వ్యతిరేకంగా ఎన్నికల బహిష్కరణ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. పొలిట్‌బ్యూరోలో అందరితో చర్చించే నిర్ణయం జరిగిందన్నారు. పార్టీ కార్యకర్తలు ఎవరైనా పోటీ చేస్తే.. అది వారి వ్యక్తిగతమని తెలిపారు. పోటీ చేయాలనుకునే వారు చేసుకోవచ్చని చెప్పారు. ఎన్నికలకు 4 వారాల కనీస గడువు అవసరమని.. ఇదే అంశంపై సుప్రీం తీర్పులున్నాయని గుర్తు చేశారు. హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉండగా నోటిఫికేషన్ ఇచ్చారని విమర్శించారు. అఖిలపక్ష భేటీకి రమ్మని చెప్పి.. ఎస్ఈసీ ముందే నిర్ణయం తీసుకున్నారన్నారు.
వైకాపా నిరంకుశ చర్యల వల్లే ఎన్నికల నుంచి తప్పుకున్నామని పయ్యావుల కేశవ్ తెలిపారు. వ్యవస్థలను నాశనం చేస్తున్న వైకాపా వైఖరిని ఖండించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రమంతటా ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించడమేంటని..? మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ప్రశ్నించారు. ఎస్‌ఈసీ పదవి చేపట్టిన వెంటనే ఎన్నికలు ఎందుకు ప్రకటించారని నిలదీశారు.