జలవనరుల గురించి మంత్రి అనిల్‌కు తెలిసింది తక్కువ, ఆయన చేసే హడావిడి ఎక్కువ అని మాజీమంత్రి జవహర్ విమర్శించారు. జగన్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి రాష్ట్రానికి అరిష్టం పట్టుకుందని ఆరోపించారు. అధికారం చేపట్టిన ఏడాదిన్నరలో ఒక్క రోజు కూడా ప్రజలు ప్రశాంతంగా పడుకోలేదని దయ్యబట్టారు. ఓ వైపు వరదలతో ప్రజలు అల్లాడుతుంటే.. జగన్ వల్లే వర్షాలు పడుతున్నాయనడం సిగ్గుచేటని మండిపడ్డారు. వర్షానికి, వరదలకి తేడా తెలియని వ్యక్తి మంత్రి అవుతారా? అని నిలదీశారు. వరదలు వచ్చినా సాగు నీరు ఇవ్వలేని జగన్ ముఖ్యమంత్రా అని జవహర్ ప్రశ్నించారు.
వర్షానికి, వరదలకు తేడా తెలియని మంత్రి అనిల్: తెదేపా - ప్రభుత్వంపై తెదేపా నేతల విమర్శలు
మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ముఖ్యమంత్రి జగన్‌పై తెదేపా నేతలు ట్విట్టర్ వేదికగా విమర్శనాస్త్రాలు సంధించారు. వర్షానికి, వరదలకి తేడా తెలియని వ్యక్తి మంత్రి అవుతారా? అని మాజీమంత్రి జవహర్ ప్రశ్నించారు. వర్షాలు పడుతున్నా రైతులకు సాగు నీరు ఇవ్వలేని జగన్ ముఖ్యమంత్రా అని మండిపడ్డారు. మంత్రి అనిల్ కుమార్ నీటి పారుదల శాఖకు రాజీనామా చేసి వేరే శాఖ తీసుకోవాలని ఎద్దేవా చేశారు తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ.
అవగాహన లేని మంత్రి వల్లే ప్రజలు, రైతులు నీట మునిగారని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ ఆరోపించారు. ఇబ్బందుల్లో ఉన్నవారిని పలకరించడం మానేసి, అందరూ సంతోషంగా ఉన్నారని చెప్పడం దారుణమన్నారు. వరదలు వచ్చినా సాగునీరు ఇవ్వలేని మంత్రి వెంటనే నీటి పారుదల శాఖకు రాజీనామా చేసి వేరే శాఖ తీసుకోవాలని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నిర్మించిన సైబరాబాద్, అమరావతి రెండూ నీట మునగలేదని, బురద మంత్రి అనిల్ ఈ విషయాలను గుర్తించాలని తెలిపారు. జగన్ ముఖ్యమంత్రిగా చేపట్టిన 17 నెలలుగా ఎప్పుడూ చూడని విపత్తులు, ప్రమాదాలు, దాడులు, అఘాయిత్యాలతో రాష్ట్రం వణికిపోతోందని ధ్వజమెత్తారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదు: చంద్రబాబు