రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల తెలుగుదేశం శ్రేణులు రైతు దగా దినం పేరిట వేర్వేరు రూపాల్లో నిరసనలు తెలిపాయి. సీఎం జగన్ ఇప్పటికైనా ఆర్భాటాలు మాని.. రైతుల సమస్యలపై దృష్టి పెట్టాలని నేతలు సూచించారు. రైతుల ఆత్మహత్యల్లో రాష్ట్రం 3వ స్థానంలో ఉందని ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లా వప్పంగిలో నిరసన తెలిపిన రామ్మోహన్ నాయుడు.. రాష్ట్రంలో రైతులు క్రాఫ్ హాలిడేను ఎందుకు ప్రకటించారో ముఖ్యమంత్రి బదులివ్వాలని డిమాండ్ చేశారు.
రైతుల పట్ల వైకాపా ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను తప్పుబడుతూ.. విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద తెలుగుదేశం నేతలు నిరసనకు దిగారు. రెండేళ్లుగా రైతు సమస్యలను ఏమాత్రం పట్టించుకోని జగన్ ప్రభుత్వం.. రైతు దినోత్సవం పేరుతో సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించి.. పంట కొనుగోళ్ల బకాయిలు చెల్లించాలని తెదేపా నేతలు ఆలపాటి రాజా, ధూళిపాళ్ల నరేంద్ర డిమాండ్ చేశారు. కృష్ణా నికర జలాలను సముద్రం పాలు చేయడం దుర్మార్గమన్నారు. ఓ వైపు తెలంగాణ ప్రభుత్వం విద్యుదుత్పత్తి చేస్తుంటే.. సీఎం జగన్ లేఖలతో కాలం వెళ్లదీస్తున్నారని ఆరోపించారు.