రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయాలని కోరుతూ.. విద్యార్ధి సంఘాలు తాడేపల్లిలోని సీఎం నివాసం ముట్టడి(chalo tadepalli)కి పిలుపు ఇచ్చారు. ఈ నేపథ్యంలో విద్యార్థి సంఘాల నాయకులకు సంఘీభావంగా బయలుదేరిన గుంటూరు పార్లమెంటరీ అధ్యక్షడు తెనాలి శ్రావణ్ కుమార్ను పోలీసులు గృహనిర్బంధం చేశారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఎలా నిర్బంధిస్తారని శ్రావణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తంచేశారు. పోలీసులు ఏకపక్షంగా వ్యహరించడం సరికాదని.. ప్రజా సమస్యల కోసం పోరాడే ప్రజాప్రతినిధులను అడ్డుకోవడం ఏంటని మండిపడ్డారు. అక్రమ అరెస్టులు, గృహ నిర్బంధాలకు భయపడేది లేదన్న ఆయన.. నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు తెదేపా పోరాడుతుందన్నారు.
అందుకే ముఖ్యమంత్రి పోలవరం పారిపోయారు: జీవీ ఆంజనేయులు
ఉద్యోగాల కోసం యువత చేసిన తిరుగుబాటుకు భయపడిన ముఖ్యమంత్రి జగన్(cm jagan).. ప్రాజెక్టు పరిశీలన పేరుతో పోలవరం పారిపోయారని నర్సరావుపేట పార్లమెంట్ తెదేపా(tdp leader gv Anjaneyulu) అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు విమర్శించారు. 2.30లక్షల ఉద్యోగాల హామీని నిలబెట్టుకోలేకపోతే రాష్ట్రం వదిలి పారిపోయే పరిస్థితి వస్తుందని విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో హెచ్చరించారు.
" రెండేళ్లలో 2శాతం పోలవరం పనులు పూర్తి చేయని ముఖ్యమంత్రి.. ఫొటోలకు పోజులివ్వటానికే ప్రాజెక్టు పరిశీలనకు వెళ్లారు. అక్కడ నిర్వాసితులకు ఇచ్చిన హామీలు, నిరుద్యోగులకు చేసిన వాగ్ధానాలను విస్మరించి వారి కళ్లల్లో కారం కొట్టారు. తెలుగు యువత, టీఎన్ఎస్ఎఫ్ నేతలను అక్రమంగా అరెస్టు చేయడం, గృహనిర్బంధాలు చేయటాన్ని ఖండిస్తున్నాం. ప్రజా తిరుగుబాటుకు భయపడే ఇంటి చుట్టూ 144సెక్షన్ పెట్టుకున్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగాలు ఇవ్వకపోగా.. చంద్రబాబు ఇచ్చిన రూ.2వేల నిరుద్యోగ భృతిని రద్దు చేయటం దుర్మార్గం. సొంత సామాజిక వర్గాలకు మాత్రమే రాజకీయ ఉద్యోగాలు ఇచ్చి ఇతర వర్గాలన్నింటినీ అవమానపరుస్తున్నారు. ప్రైవేటు రంగంలోనూ పరిశ్రమలు తరలిపోయేలా చేశారు. యువతకు ఉద్యోగాలు కల్పించి నిరుద్యోగ భృతి ఇచ్చిన చంద్రబాబునే కాల్చిచంపాలన్న జగన్ రెడ్డిని ఇప్పుడేం చేయాలి. ఉద్యోగాలు ఇవ్వటం చేతకాని సీఎం వెంటనే గద్దె దిగాలి." అని డిమాండ్ చేశారు.
ఎన్టీఆర్ భవన్ వద్ద బలవంతపు అరెస్టులు
చలో తాడేపల్లి నేపథ్యంలో తెదేపా కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్(ntr bhavan) వద్ద భారీగా పోలీసులను మోహరించారు. పార్టీ కార్యాలయంలో టీఎన్ఎస్ఎఫ్, తెలుగుయువత కార్యకర్తలు ఉన్నారనే సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆఫీస్ నుంచి బయటకొచ్చిన పలువురు కార్యకర్తలను బలవంతంగా అరెస్టు చేసి స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించారు.
నిరుద్యోగులను మోసం చేశారు
ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికైనా నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కల్యాణదుర్గం నియోజకవర్గం తెదేపా ఇన్ఛార్జీ ఉమామహేశ్వర నాయుడు డిమాండ్ చేశారు. చలో తాడేపల్లి సందర్భంగా నిరుద్యోగులు, తెదేపా నేతలను ఎక్కడికక్కడ అరెస్టులు, గృహనిర్బంధం చేసి తీవ్ర ఇబ్బందికి గురిచేశారని మండిపడ్డారు. పోలీసులు ఏకపక్ష ధోరణితో వ్యవహరించడం సరికాదన్నారు.
ముఖ్యమంత్రి జగన్ పాలనలో ప్రజాప్రతినిధులను దొంగలు, దోపిడీదారుల వలే చూస్తున్నారని ఉమామహేశ్వర నాయుడు అన్నారు. ఎన్నికల ముందు మాయమాటలు చెప్పి, అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులను తీవ్రంగా మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే వరకు ప్రభుత్వంపై పోరాడటానికి తెదేపా నాయకులు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.