ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వాణిజ్య విషాదం నెలకొంటే.. ఉత్సవాలు ఎలా చేస్తారు: యనమల

వైకాపా అరాచక పాలనతో రాష్ట్రంలో వాణిజ్య విషాదం నెలకొంటే, ఉత్సవాలెలా చేస్తారని శాసనమండలి ప్రధాన ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. పారిశ్రామిక, వాణిజ్య రంగాలు తిరోగమనంలో ఉన్నాయనడానికి కాగ్ నివేదికలు, బడ్జెట్ గణాంకాలు, సోషియో ఎకనామిక్ సర్వేలే నిదర్శనమని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

యనమల
యనమల

By

Published : Sep 22, 2021, 7:32 PM IST

వైకాపా అరాచక పాలనతో రాష్ట్రంలో వాణిజ్య విషాదం నెలకొంటే.. ఉత్సవాలెలా చేస్తారని శాసనమండలి ప్రధాన ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. పారిశ్రామిక, వాణిజ్య రంగాలు తిరోగమనంలో ఉన్నాయనటానికి కాగ్ నివేదికలు, బడ్జెట్ గణాంకాలు, సోషియో ఎకనామిక్ సర్వేలే నిదర్శనమని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

"వాణిజ్య ఉత్సవంలో ముఖ్యమంత్రి ప్రసంగం రాజుగారి వంటిమీద దేవతా వస్త్రాల కథను పోలి ఉంది. నేతిబీర చందంగా జగన్ రెడ్డి రాష్ట్రాభివృద్ధిపై గణాంకాలు చెప్పారు. పారిశ్రామికవేత్తలను వంచిస్తూ వాస్తవ గణాంకాలకు విరుద్ధంగా సీఎం మాట్లాడారు. తెదేపా, వైకాపా ప్రభుత్వాల రెండేళ్ల పాలనను బేరీజు వేస్తే పారిశ్రామిక, వాణిజ్య రంగాలు అధఃపాతాళానికి చేరాయి. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి అయిదు నెలల్లో 34శాతం మేర రాష్ట్రంలో జీఎస్టీ వసూళ్లు తగ్గాయి. పరిధికి మించి తెచ్చిన అప్పులు, రెవెన్యూ వ్యయంతో వైకాపా పెద్దలు నయా ధనవంతుల్లా మారారు తప్ప పేదల జీవన స్థితిగతులు ఏమాత్రం మారలేదు. వైకాపా రెండేళ్ల పాలనలో మూలధన వ్యయం గణనీయంగా తగ్గి, పారిశ్రామిక పెట్టుబడులు లేక నిరుద్యోగం ప్రబలింది. జాతీయస్థాయిలో నిరుద్యోగిత రేటు 11.9శాతం ఉంటే, రాష్ట్రంలో మాత్రం 13.5శాతంగా నమోదైంది. క్షేత్రస్థాయిలో ఇది 15శాతంపైనే ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం విదేశీ పెట్టుబడుల ఆకర్షణలో ఆంధ్రప్రదేశ్ కేవలం రూ.673 కోట్ల (0.1శాతం) మాత్రమే ఆకర్షించి.. దేశంలో 13వస్థానంలో నిలిచింది. 2018-19లో తెదేపా ప్రభుత్వం రూ.23,882 కోట్ల పెట్టుబడులు ఆకర్శించి రాష్ట్రాన్ని 4వస్థానంలో నిలిపింది. జెసిబి, ఎసిబి, పిసిబి విధానాలకు జెట్యాక్స్ తోడవటంతో రాష్ట్రం నుంచి పారిశ్రామికవేత్తలు పరారయ్యారు. వైకాపా అవినీతితో అభివృద్ధి కుంటుపడి రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయి దివాలా స్థితికి చేరుకుంది. అప్పులు రూ.5లక్షల కోట్లు దాటిపోవటంతో ఆర్థిక అత్యయిక స్థితి విధించే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఇకనైనా ప్రజలను మోసగించడం మాని అభివృద్ధిపై దృష్టి పెట్టకుంటే రానున్న రోజులు మరింత దయనీయంగా మారనున్నాయి" అని హెచ్చరించారు.

వైకాపా-తెదేపా తొలి రెండేళ్ల పాలనలో వ్యత్యాసం

వివిధ రంగాల్లో తెదేపా పాలన(2017-19) వైకాపా పాలన(2019-21) సగటు వ్యత్యాసం

రంగాలు తెదేపా పాలన వైకాపా పాలన తేడా
పారిశ్రామిక రంగం 9.8 4.6 (-)5.2
ఉత్పాదక రంగం 9.3 6.4 (-)3.2
నిర్మాణరంగం 8.3 2.4 (-)6.4
స్థిరాస్తి రంగం 11.8 8.7 (-)3.1
సేవల రంగం 12.5 5.5 (-)7.0
వాణిజ్య, అనుబంధరంగాలు 12.2 1.1 (-)11.1

ఇదీ చదవండి:అయేషా మీరా కేసు.. సీబీఐ పిటిషన్ కొట్టివేత

ABOUT THE AUTHOR

...view details