TDP Reaction on YSRCP Rajya Sabha Candidates: జగన్మోహన్ రెడ్డి తాను సీఎంగా తప్పుకుని బీసీని ముఖ్యమంత్రి చేయగలడా అని శాసనమండలి ప్రధాన ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు సవాల్ విసిరారు. బీసీల బ్యాక్ బోన్ విరగొట్టిందే సీఎం జగన్ కాదా అని నిలదీశారు. బీదా మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్యలకు రాజకీయ అవకాశాలు కల్పించిందే తెలుగుదేశం పార్టీ అని గుర్తు చేశారు. తెదేపా తీర్చిదిద్దిన బీసీ నేతలకు జగన్ రెడ్డి రాజ్యసభ సీట్లు ఇచ్చారన్నారు. వైకాపాలో బీసీ నేతలు లేకే, తెదేపా రాజకీయ అవకాశాలు కల్పించిన నేతలకు పదవులు ఇస్తున్నారని విమర్శించారు.
వైకాపాలో ఒకే సామాజిక వర్గానికి పెత్తనం ఇస్తూ.. ఇతర కులాలను అణగదొక్కుతున్నారని యనమల మండిపడ్డారు. రాష్ట్రాన్ని 4 ప్రాంతాలుగా విభజించి.. జగన్ సామాజిక వర్గ నేతలకు కట్టబెట్టారని ధ్వజమెత్తారు. తెదేపా అంటేనే బీసీల పార్టీ అని... ఈ విషయాన్ని తాము ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదన్నారు. వైకాపాలో పెత్తనం లేని పదవులే బీసీలకు లభిస్తున్నాయని విమర్శించారు. ఆ పార్టీలో పెత్తనం అంతా సజ్జల, విజయసాయి, వైవీ సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డిలదేనన్నారు. బీసీల సంక్షేమం, బీసీల కులగణన, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు గురించి ఏనాడైనా వైకాపా ఎంపీలు మాట్లాడారా అని నిలదీశారు. లాబీయింగ్ కోసమే నిరంజన్ రెడ్డికి పదవులు ఇచ్చిన వాస్తవం ప్రజలకు తెలుసని దుయ్యబట్టారు.
ఏపీలో ఉన్న బీసీలు.. బీసీలు కాదా..: నిధులు, విధులతోపాటు కూర్చోవడానికి కుర్చీ కూడా లేని ఉత్తుత్తి 56 కార్పొరేషన్లను బీసీలకు విదిల్చి.. తెలంగాణ వాళ్లకు అత్యున్నత రాజ్యసభ స్థానాలు కట్టబెడుతున్నారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు అయ్యన్నపాత్రుడు ధ్వజమెత్తారు. పెద్దల సభకి వెళ్లే అర్హత ఏపీలోని 140కి పైగా ఉన్న బీసీ కులాలలో ఏ ఒక్క నేతకీ లేదా అని నిలదీశారు. ఏపీలో ఉన్న బీసీలు.. బీసీలే కాదని జగన్ రెడ్డి అనుకుంటున్నారా అని ప్రశ్నించారు. నిధులు, నీళ్లు, నియామకాలు నినాదంతో పోరాడి ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడిందని... జగన్ రెడ్డి సీఎం అయిన మొదటి రోజునుంచే ఏపీ నిధులు, నీళ్లు, నియామకాలన్నీ తెలంగాణకి దోచిపెడుతున్నారని మండిపడ్డారు.
YSRCP Rajya Sabha MP Candidates: వైకాపా రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై ముఖ్యమంత్రి జగన్ కసరత్తు ముగిసింది. సామాజిక సమీకరణాలు, పార్టీకి చేసిన సేవల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేశారు. వైకాపా పార్లమెంటరీ పార్టీ నేతగా వ్యవహరిస్తున్న విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యత్వాన్ని వైకాపా మరోసారి పొడిగించింది. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్యకు రాజ్యసభ సీటు వరించింది. న్యాయవాది నిరంజన్ రెడ్డి, నెల్లూరు జిల్లాకు చెందిన వైకాపా నేత బీద మస్తాన్ రావును రాజ్యసభ అభ్యర్థులుగా వైకాపా ఖరారు చేసింది.
ఇదీ చదవండి:YSRCP MP Candidates: వైకాపా రాజ్యసభ అభ్యర్థులు వీరే..