పార్టీ పదవుల్లో అత్యధిక అవకాశాలతో.. తెలుగుదేశం బీసీల పార్టీగా మరోసారి రుజువైందని శాసన మండలి ప్రధాన ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు అన్నారు. తెదేపా సంస్థాగత కమిటీల్లో బీసీలకు పెద్దపీట వేసినందుకు అధినేత చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. రెండు రాష్ట్రాల సైకిల్ సారథులు బీసీలేనని యనమల గుర్తుచేశారు. వైకాపా ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేసిందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లుసగానికిపైగా తగ్గించిన వైకాపా సర్కార్... 'ఆదరణ' పథకం రద్దుతో వెనుకబడిన వర్గాల పొట్టగొట్టిందని మండిపడ్డారు.
అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా తెలుగుదేశం పార్టీ బీసీలకు సముచిత స్థానం కల్పించి గౌరవిస్తోందని శాసనమండలి ప్రధాన ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. టీటీడీ సహా ఇతర అన్ని కీలక పదవులను జగన్ సొంత సామాజికవర్గానికే కట్టబెడుతున్నారని అయన విమర్శించారు. తితిదే ఛైర్మన్లుగా బీసీలైన కళా వెంకట్రావు, పుట్టా సుధాకర్ యాదవ్ లను తెదేపా నియమిస్తే..., తాజా పాలకమండలిలో ఎటు చూసినా జగన్ సామాజికవర్గమేనని మండిపడ్డారు. ఛైర్మన్,ఈవో, జెఈవో, అందరినీ ఏరికోరి నియమించిన చరిత్ర జగన్ దేనని దుయ్యబట్టారు. వైకాపా 4 ప్రాంతాల బాధ్యులుగానూ విజయసాయి రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలు ఒకే సామాజికవర్గం వారన్న యనమల..., స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను సగానికి పైగా తగ్గించారని ధ్వజమెత్తారు. కొన్ని జిల్లాలలో 11శాతం కూడా ఇవ్వలేదని ఆక్షేపించారు.