TDP VARLA LETTER TO DGP : హైదరాబాద్‌లోని చింతకాయల విజయ్ ఇంటిలో సీఐడీ పోలీసులు ప్రవర్తించిన తీరుపై తెదేపా సీనియర్ నేత వర్ల రామయ్య రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డికి లేఖ రాశారు. సీఐడీ పోలీసుల తీరు మానవహక్కుల ఉల్లంఘనేనని లేఖలో తెలిపారు. సీఐడీ పోలీసులు బ్యాడ్జీలు ఎందుకు ధరించలేదని.. చిన్నపిల్లలను ప్రశ్నించాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. 41A నోటీసు ఇవ్వడానికి వెళ్లితే.. ఇంట్లో సోదాలు చేయాల్సిన అవసరం ఏంటని నిలదీశారు. విజయ్ డ్రైవర్ చంద్రను కొట్టాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. సీఐడీ పోలీసుల్ని సక్రమమైన మార్గంలో పెట్టకుంటే దేశవ్యాప్తంగా నవ్వులపాలయ్యే అవకాశం ఉందన్నారు. ప్రాథమిక హక్కులు, సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన ఏపీ సీఐడీ అధికారులపై చర్య తీసుకోవాలని డీజీపీకి రాసిన లేఖలో వర్ల రామయ్య కోరారు.
ఇదీ జరిగింది:
సీఎం జగన్ సతీమణి భారతిపై అసత్య కథనాలు ప్రచారం చేశారంటూ.. ఐటీడీపీ నేత చింతకాయల విజయ్‌కు నోటీసులిచ్చేందుకు వచ్చిన సీఐడీ పోలీసులు దురుసుగా ప్రవర్తించారని కుటుంబసభ్యులు ఆరోపించారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని విజయ్ నివాసానికి వచ్చిన పోలీసులు.. బ్యాంకు అధికారులమంటూ హడావుడి చేసి అనధికారికంగా ఇంట్లో సోదాలు చేశారని మండిపడ్డారు. పోలీసులు తనని కొట్టడమేగాక.. విజయ్ ఐదేళ్ల కుమార్తెను బెదిరించారని ఆయన వ్యక్తిగత సహాయకుడు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విజయ్ ఇంట్లో లేకపోవడంతో పనిమనిషికి సీఐడీ పోలీసులు నోటీసులు ఇచ్చి వేళ్లారు. ఈనెల 6న మంగళగిరిలోని సీఐడీ ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరుకాకుంటే.. అరెస్ట్ చేస్తామని నోటీసుల్లో పేర్కొన్నారు .