వివేకా హత్య కేసులో రంగయ్య వాంగ్మూలం కీలకంగా మారిన తరుణంలో సీబీఐ అధికారి సుధాసింగ్ను బదిలీ చేయడమేంటని తెదేపా సీనియర్ నేత వర్ల రామయ్య ప్రశ్నించారు. హత్య కేసులో 8 కోట్ల సుపారీ ఇచ్చిన ఇద్దరు ప్రముఖులెవరో.. సీఎం జగన్ రాష్ట్ర ప్రజలకు తెలియచేయాలని డిమాండ్ చేశారు. రంగయ్య వాంగ్మూలం తాలూకా వివరాలు బయటకొచ్చినా ముఖ్యమంత్రి, డీజీపీ స్తబ్దుగా ఉండిపోవడానికి కారణమేంటని నిలదీశారు. సొంత బాబాయిని చంపినవారెవరో ముఖ్యమంత్రికి తెలిసే ఉంటుందని.., అందుకే ఆయనలా నిర్లిప్తంగా ఉన్నారని దుయ్యబట్టారు.
రంగన్న వాంగ్మూలం నమోదు
మాజీమంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్యకేసులో 23వ తేదీ శుక్రవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. 47 రోజులుగా కడప కేంద్ర కారాగారం అతిథి గృహంలో అనుమానితులను విచారణ చేస్తున్న సీబీఐ అధికారులు.. దర్యాప్తులో కీలక ముందడుగు వేశారు. వివేకా ఇంటి వాచ్మెన్ రంగన్న వాంగ్మూలాన్ని జమ్మలమడుగు మెజిస్ట్రేట్ ముందు నమోదు చేయించారు. ఉదయం కడప నుంచి సీబీఐ అధికారులు రంగన్నను తీసుకుని జమ్మలమడుగు వెళ్లారు. 11 నుంచి 12 గంటల మధ్యలో జమ్మలమడుగు మెజిస్ట్రేట్ ముందు రంగన్న వాంగ్మూలం నమోదు చేశారు. మెజిస్ట్రేట్ ఫకృద్ధీన్ సెక్షన్ 164 కింద రంగన్న వాంగ్మూలం నమోదు చేశారు. వాంగ్మూలం నమోదు చేసే సమయంలో మెజిస్ట్రేట్... రంగన్న మినహా మిగిలిన వారెవ్వరూ లేకుండా చూసుకున్నట్లు తెలుస్తోంది. స్టెనో కూడా లేకుండా మెజిస్ట్రేట్ స్వయంగా వాంగ్మూలం నమోదు చేసినట్లు సమాచారం. వివేకా హత్యకేసుకు సంబంధించి రంగన్న చెప్పిన విషయాలను మెజిస్ట్రేట్ రికార్డు చేశారు. పులివెందుల మెజిస్ట్రేట్ అందుబాటులో లేనందున ఇన్ ఛార్జిగా ఉన్న జమ్మలమడుగు మెజిస్ట్రేట్ ముందుకు సీబీఐ అధికారులు రంగన్నను తీసుకెళ్లారు. తర్వాత రంగన్నను సీబీఐ అధికారులు కడపకు తీసుకొచ్చారు.