పోలీస్ శాఖలో 15 వేల మంది మహిళల్ని చేర్చుకున్నామని డీజీపీ గౌతం సవాంగ్ చేసిన ప్రకటనపై స్పష్టత ఇవ్వాలని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య డిమాండ్ చేశారు. పోలీస్ వ్యవస్థలోనూ.. అధికార పార్టీ కార్యకర్తల్ని చట్టానికి విరుద్ధంగా వాలంటీర్లగా నియమించారా అని నిలదీశారు. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా కాకుండా.. వారిని పోలీస్ శాఖలో ఎలా చేర్చుకున్నారో సమాధానం చెప్పాలన్నారు. డీజీపీ ప్రకటన.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి భజన చేస్తున్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు.
డీజీపీగా బాధ్యతలు చేపట్టిననాటి నుంచీ గౌతం సవాంగ్ తప్పటడుగులు వేస్తున్నారని విమర్శించారు. గత రెండేళ్లలో 6 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తే.. గత ప్రభుత్వం కేవలం 34 వేలు మాత్రమే భర్తీ చేసిందని డీజీపీ ఓ రాజకీయ నాయకుడిలా ప్రకటన ఎలా జారీ చేస్తారని నిలదీశారు. ఉద్యోగాల భర్తీకి సంబంధించి గత ప్రభుత్వం ఏం చేసిందో, ఈ ప్రభుత్వం ఏం చేస్తోందో బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ డీజీపీకి సవాల్ విసిరారు. ఎప్పుడో తొలగించిన 66ఐటీ యాక్ట్ కింద అనేక మందిని ఎలా అరెస్టు చేశారో డీజీపీ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.