ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'పోలవరంలో అవినీతి లేదన్న కేంద్ర జలశక్తి నివేదికపై.. సమాధానమేది?'

పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టుల నిర్మాణాల్లో ఎటువంటి అవినీతి జరగలేదని కేంద్ర జలశక్తి స్పష్టం చేసిందని మాజీ మంత్రి దేవినేని ఉమా అన్నారు. అవినీతి జరిగిందని పుస్తకాలు ముద్రించి రాద్ధాంతం చేసిన వైకాపా ఇప్పుడేం సమాధానం చెప్తుందని ప్రశ్నించారు. తెదేపా ప్రభుత్వం కేవలం 20 శాతం పనులు పూర్తిచేసిందని ఆరోపించిన వైకాపా.. నవంబరులో 40 గేట్లు బిగిస్తామని ఎలా చెప్పిందని ప్రశ్నించారు. నందిగామ విలేకరి ఘంటా నవీన్ హత్య వెనుక వైకాపా శాండ్ మాఫియా ఉందని ఉమా ఆరోపించారు.

By

Published : Jun 30, 2020, 2:14 PM IST

ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టులో అవినీతి జరగలేదని, కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపుల తర్వాతే ప్రాజెక్టు అంచనాలు జరిగాయని కేంద్ర జలశక్తి శాఖ స్పష్టంగా తేల్చి చెప్పినట్లు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టుల్లో అవినీతి జరగలేదన్న జలశక్తి శాఖ నివేదికకు వైకాపా ఏం సమాధానం చేప్తుందని ప్రశ్నించారు. పోలవరం నిర్వాసితుల పరిహారంలో వ్యత్యాసాలున్నాయన్న ఆరోపణలు నిజంకాదని, జలశక్తి శాఖ చెప్పినట్లు పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టులో 20 శాతం పనులు మాత్రమే జరిగితే నవంబరు నాటికి 40 గేట్లు ఎలా బిగిస్తారని ఉమా ప్రశ్నించారు.

బోర్లు వేసేవాళ్లకు వెలిగొండ టన్నెల్ పనులు

పోలవరంలో 70 శాతం పనులు జరిగాయన్న నిజాన్ని అంగీకరించేందుకు ముఖ్యమంత్రికి మనసు రావటం లేదన్నారు. పట్టిసీమ ద్వారా ఐదేళ్లలలో తెదేపా ప్రభుత్వంలో 44 వేల కోట్ల విలువైన పంటను కాపాడినట్లు గుర్తు చేశారు. బోర్లు వేసేవాళ్లను తెచ్చి వెలిగొండ టన్నెల్ పనులు చేయిస్తున్నారని ఆరోపించారు. ఆరు లక్షల కోట్ల అవినీతి జరిగిందని పుస్తకాలు ముద్రించిన వాళ్లు ఐదేళ్ల బడ్జెట్ ఎంతో చెప్పలేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఇసుక మాఫియా, ల్యాండ్ మాఫియా, వైన్ మాఫియా, మైన్ మాఫియా రాజ్యమేలుతున్నాయని ఆరోపించారు.

విలేకరి హత్య వెనుక ఇసుక మాఫియా

వైకాపా నాయకులు ఇసుకను రోజుకు వెయ్యి లారీల చొప్పున ఇతర రాష్ట్రాలకు తరలించుకుపోతున్నారని విమర్శించారు. ఇళ్ల స్థలాల పంపిణీలోనూ అవినీతి జరుగుతున్నట్లు ఉమా తెలిపారు. విలేకరి ఘంటా నవీన్ హత్య వెనుక శాండ్ మాఫియా ఉన్నట్లు పోలీసు విచారణలో తేలిందన్నారు. శాండ్ మాఫియా ఇంట్లో ఒక అధికారితో జరిగిన ముచ్చట్లను రాసినందుకే విలేకరిని హత్య చేశారన్నారు. ఎవరా అధికారి? హత్య వెనుక అసలు సూత్రధారులెవరో? బయటపెట్టాలని ప్రశ్నించారు. పూర్తిస్థాయి విచారణ జరిపి పోలీసులు నిజానిజాలను నిగ్గు తేల్చాలని దేవినేని ఉమా డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి :పెళ్లై కొద్ది నెలలే.. అంతలోనే అనంతలోకాలకు

ABOUT THE AUTHOR

...view details