రాజధాని కోసం భూములిచ్చిన రైతులు.. కుటుంబాలతో సహా రోడ్డెక్కి 365రోజులుగా పోరాడుతున్నారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆనాడు నిండుసభలో ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, శంకుస్థాపన రోజు ప్రధాని... ముగ్గురూ ఒకే మాట మాట్లాడితే నమ్మి రైతులు భూములిచ్చారని తెలిపారు. రైతులు రోడ్డెక్కి పోరాడుతున్నా ముఖ్యమంత్రి మనస్సు కరగకపోవడం దురదృష్టకరమన్నారు. ఇకపై ప్రభుత్వంతో ఒప్పందం అంటే నమ్మకం పోయే పరిస్థితి నెలకొందన్నారు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి మొండిగా పోకుండా 13 జిల్లాలకు కేంద్రమైన అమరావతినే రాజధానిగా కొనసాగించాలని సోమిరెడ్డి డిమాండ్ చేశారు. రాజధాని కోసం పోరాడుతున్న మన ఆడపడుచులను పోలీసుల బూటు కాళ్లతో తన్నించడాన్ని ప్రజలు క్షమించరన్నారు. క్షణం కూడా ఆలస్యం చేయకుండా జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకోవాలన్నారు.
మరో వైపు కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశంలోని రైతులందరూ పోరాడుతున్నారన్న సోమిరెడ్డి...వారి పోరాటాన్ని చూసి చలించిపోయి సిక్కు మత ప్రబోధకుడు సంత్ బాబా రాంసింగ్ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందన్నారు. ప్రజలెన్నుకున్న ప్రభుత్వం సమస్యను పరిష్కరించకపోతే... తామే రైతు నాయకులతో కమిటీ వేస్తామని సాక్షాత్తు సుప్రీం కోర్టే నిర్ణయం తీసుకునే పరిస్థితి ప్రధాని మోదీ ఎందుకు తెచ్చుకోవాలని నిలదీశారు. రైతులకు న్యాయం చేసే విషయంలో పట్టువిడుపులు ఉండాలన్నారు. వెంటనే ఒక మెట్టుదిగి చట్టాలను సవరించి రైతులను మెప్పించాల్సిన బాధ్యత ప్రధాని మోదీపై ఉందన్నారు. రైతుల విషయంలో ఇటు సీఎం, అటు పీఎం మంచి మనస్సు చేసుకోవాలని సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.