Somireddy Fires On YCP Govt: సినిమా టికెట్ రేట్ల తగ్గింపుతో పేదలకు ఏదో చేశామని చెబుతున్న ప్రభుత్వం.. పరిశ్రమ మూత పడే పరిస్థితి వస్తోందన్న విషయాన్ని గమనించడం లేదని మాజీమంత్రి సోమిరెడ్డి మండిపడ్డారు. ఇద్దరు, ముగ్గురు సినిమా హీరోలపై కక్షతో.. సినిమా పరిశ్రమను నాశనం చేసే హక్కు ఎవరు ఇచ్చారని ధ్వజమెత్తారు. ఇప్పటికే 125 సినిమా థియేటర్లు మూత పడ్డాయని, కక్ష సాధింపులకు హద్దు ఉంటుందన్నారు. నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేటలో అతిపెద్ద థియేటర్ మూసివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Somireddy On Movie Tickets Issue: సినిమా రంగం జోలికి వెళ్లవద్దని సోమిరెడ్డి హితవు పలికారు. థియేటర్లు మూసివేసే పరిస్థితి రావడం సహించరానిదన్నారు. తెలంగాణలో ఎకరానికి రూ.10వేల రైతుబంధు ఇస్తున్నారని.. అలాంటి పథకాలతో పోటీపడాలని సూచించారు. వైకాపా ప్రభుత్వానికి చేతనైతే నిత్యావసర వస్తువులు, ఇసుక, ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఇతర రాష్ట్రాల కంటే పెట్రోల్, డీజిల్ రేట్లు ఏపీలో ఎక్కువ ఉన్నాయని.. వాటి తగ్గింపుపై దృష్టిపెట్టాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం టికెట్ రేట్లు పెంచిన విషయాన్ని కూడా గుర్తు చేశారు.