సంగం డెయిరీ యాజమాన్యం మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులివ్వటాన్ని తెలుగుదేశం పార్టీ ఖండించింది. సంగం డెయిరీని హస్తగతం చేసుకునేందుకే ప్రభుత్వం తప్పుడు జీవో తీసుకొచ్చిందని తెదేపా అధికార ప్రతినిధి పట్టాభిరామ్ విమర్శించారు. జీవో నెంబర్ 19 ఇవ్వటం దుర్మార్గమన్నారు. కంపెనీ యాక్ట్ ప్రకారం ఏర్పాటైన కంపెనీని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవటం కుదరదన్న ఆయన.. ఏడాది క్రితమే సంగం డెయిరీ హస్తగతం కోసం ప్రణాళికలు రచించారని ఆరోపించారు. ధూళిపాళ్ల నరేంద్ర ఛైర్మన్గా ఉంటే అది సాధ్యం కాదు కాబట్టే కుట్రతో ఆయన్ని అరెస్టు చేశాక జీవో ఇచ్చారని వ్యాఖ్యానించారు.
'నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు(ఎన్డీడీబీ) ప్రోత్సాహంతో ఏర్పాటైన ప్రొడ్యూసర్ కంపెనీ.. సంగం డెయిరీ. ఎన్డీడీబీకి సంగం ఆస్తులు తనఖా పెట్టి రుణం తెచ్చుకున్నారని మోపిన అభియోగంలో తప్పేముంది. రుణం తీసుకోవటం నరేంద్ర చేసింది నేరమైతే ఎన్డీడీబీ అధికారులదీ నేరమే. ఎన్డీడీబీ అధికారులపైనా కేసు పెట్టగలరా..? 367సొసైటీలు, లక్షా 27వేల మంది రైతుల భాగస్వామ్యులుగా ఉన్న కంపెనీకి నరేంద్ర ప్రతినిధి మాత్రమే. అమూల్ కి రాష్ట్రంలోని పాడి వ్యాపారం మొత్తం కట్టబెట్టేందుకే ఈ కుట్ర చేశారు.'-పట్టాభిరామ్, తెదేపా అధికార ప్రతినిధి