ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కమీషన్ల దాహం తీర్చలేకే వ్యాక్సిన్ల గ్లోబల్ టెండర్లకు ఏ సంస్ధ ముందుకు రాలేదని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆరోపించారు. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ నియంత పరిపాలన తరహాలోనే జగన్ రెడ్డి పాలన ఉన్నందున సంస్థలన్నీ భయపడిపోతున్నాయని ధ్వజమెత్తారు. అంతర్జాతీయ న్యాయస్థానంలో కూడా కేసులున్న జగన్ రెడ్డికి.. విశ్వసనీయత ఎక్కడుందని మండిపడ్డారు.
వ్యాక్సిన్లకు కేంద్రం సహకరించాలని జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ ట్వీట్ పెట్టినప్పుడు.. వెంటనే ఖండించిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడెలా అన్ని రాష్ట్రాల సీఎంలకు లేఖ రాశారని పట్టాభి నిలదీశారు. అన్ని దేశాలు, రాష్ట్రాలు 3వ దశ పట్ల అప్రమత్తమయితే ఏపీ సీఎం మాత్రం బాధ్యత లేకుండా ఉన్నారని విమర్శించారు. సొంత లాయర్లకు కోట్లాది రూపాయల ప్రజాధనం చెల్లిస్తూ జీవోలు ఇచ్చినప్పుడు నిధుల కొరత గుర్తుకు రాలేదా అని నిలదీశారు.