TDP leader Pattabhi హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ నగ్న వీడియో కాల్‌కు సంబంధించి ప్రచారంలో ఉన్న వీడియో అసలైందేనని అమెరికాకు చెందిన ఫోరెన్సిక్ నిపుణుడు జిమ్ స్టాఫర్డ్ ఇచ్చిన నివేదికను సీఐడీ చీఫ్ సునీల్‌కుమార్ దాచిపెట్టి, ప్రజల్ని పక్కదారి పట్టిస్తున్నారని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ధ్వజమెత్తారు. సునీల్‌కుమార్ దాచిన రిపోర్టు కాపీ తన వద్ద ఉందంటూ ఆ పత్రాన్ని మీడియాకు విడుదల చేశారు. పట్టాభి సోమవారం ఆన్‌లైన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సునీల్‌కుమార్ తప్పు చేయకుంటే.. జిమ్ స్టాఫర్డ్ నివేదికకు సంబంధించి తెదేపా విడుదల చేసిన డాక్యుమెంట్, ఆయనకు ఎక్లిప్స్ ల్యాబ్ పంపిందని చెబుతున్న నివేదికను పోలుస్తూ ప్రజలకు వాస్తవాలు చెప్పాలని డిమాండ్ చేశారు. ‘2022 ఆగస్టు 11న ఎక్లిప్స్ ఫోరెన్సిక్ లాబొరేటరీ అధినేత జిమ్ స్టాఫర్డ్ ఇచ్చిన ప్రాథమిక నివేదిక (సీఐడీ చీఫ్ దాచిపెట్టిన నివేదిక)లో పోతిని ప్రసాద్.. ఆ వీడియోను ఫోరెన్సిక్ పరీక్ష నిమిత్తం ల్యాబ్‌కు ఎప్పుడిచ్చారో ప్రస్తావించలేదు. అలాగే, ‘వీడియో కాల్’కు బదులు ‘ఫేస్‌టైం వీడియో కాల్’ అని రాశారు. దాంతో ప్రజలకు అర్థమయ్యేందుకుగానూ నివేదికలో రెండు చిన్న సవరణలు చేయాలని ల్యాబ్‌ను పోతిని ప్రసాద్ కోరారు. ల్యాబ్‌కు వీడియో అందజేసిన తేదీ (2022 ఆగస్టు 9)ని నివేదికలో ప్రస్తావించాలని, ‘ఫేస్‌టైం వీడియో కాల్’కు బదులు ‘వీడియో కాల్’ అని చేర్చాలని కోరారు. ల్యాబ్ సిబ్బంది ఆ రెండు చిన్న సవరణలు చేసి రిపోర్ట్‌ను ప్రసాద్‌కు ఇచ్చింది. అంతకుమించి మరే అంశాన్నీ సవరించలేదు. సీఐడీ చీఫ్ పంపిన ఈమెయిల్‌కు జిమ్ స్టాఫర్డ్ బదులిస్తూ.. ఆ రెండు సవరణలూ అంతగా పరిగణనలోకి తీసుకోవాల్సినవి కాదని స్పష్టంగా చెప్పారు. ల్యాబ్‌కు ప్రసాద్ పంపిన వీడియో నిజమైందేనని కూడా ధ్రువీకరించారు. ల్యాబ్ సిబ్బంది సవరించిన నివేదిక ప్రసాద్‌కు ఇచ్చిన విషయం తెలీక.. జిమ్ స్టాఫర్డ్ తన ప్రాథమిక నివేదికనే సునీల్‌కుమార్‌కు మెయిల్ ద్వారా పంపించారు’ అని పట్టాభి వివరించారు.
సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపే ధైర్యముందా?
‘జిమ్ స్టాఫర్డ్ తనకు పంపిన ప్రాథమిక నివేదికను సునీల్‌కుమార్ ఉద్దేశపూర్వకంగా బహిర్గతం చేయకుండా, ఆకాశం బద్ధలై భూమిపై పడ్డట్టుగా, ఘోర తప్పిదమేదో జరిగిపోయినట్టుగా ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేశారు. మాధవ్ వీడియో పరిశీలించిన స్టాఫర్డ్ అది నూరుశాతం నిజమని తేల్చిన మాట వాస్తవం. ప్రభుత్వానికి ఇంకా నమ్మకం కుదరకపోతే ఆ వీడియోను సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించి వాస్తవం తెలుసుకోవాలి. ప్రభుత్వానికి ఆ ధైర్యముందా?’ అని పట్టాభి సవాల్ చేశారు. ‘సునీల్‌కుమార్‌కు స్టాఫర్డ్ పంపిన ప్రాథమిక నివేదిక, ఈ రోజు నేను ప్రజల ముందు ఉంచుతున్న నివేదిక ఒక్కటే. ఒకవేళ కాదంటే సునీల్‌కుమార్ తన వద్దనున్న నివేదికను మీడియా వేదికగా లైవ్‌లో తన ఈమెయిల్ ఖాతా నుంచి డౌన్‌లోడ్ చేసి ప్రజలకు చూపించాలి’ అని డిమాండ్ చేశారు. తెదేపా విడుదల చేసిన ఎక్లిప్స్ ల్యాబ్ రిపోర్టుపై బురదజల్లుతున్న సునీల్‌కుమార్.. వైకాపా సామాజిక మాధ్యమాల్లో ‘ఆల్బర్ట్ ఫోరెన్సిక్ ల్యాబ్’ పేరుతో విడుదల చేసిన నకిలీ నివేదికపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని పట్టాభి డిమాండ్ చేశారు.