రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ జగన్నాటకం ముందు ఆస్కార్ అవార్డు సైతం దిగదుడుపేనని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. టెర్రరిస్ట్ ఇంటిపై దాడి చేసినట్టు బీసీ నేత అచ్చెన్నాయుడు ఇంట్లోకి పోలీసులు ప్రవేశించారని మండిపడ్డారు. ఆపరేషన్ అయ్యిందని రిపోర్టులు చూపించినా మానవత్వం లేకుండా ప్రవర్తించారని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం మందులు తీసుకునే అవకాశం కూడా ఇవ్వకుండా హింసించారని ధ్వజమెత్తారు.
ఆరోపణ వచ్చిన రోజే విచారణకు సిద్ధమన్న అచ్చెన్నాయుడిని 20 గంటల పాటు రోడ్లపై తిప్పి గాయం పెద్దదయ్యేలా అత్యంత క్రూరంగా వ్యవహరించారని నారా లోకేశ్ దుయ్యబట్టారు. ప్రతి నిమిషం అచ్చెన్నాయుడు పడుతున్న కష్టాన్ని తెలుసుకుని ఆనందపడిన జగన్.. ఇప్పుడు మంచి వైద్యం అందించమని అధికారులకు చెప్పడం జగన్నాటకం కాకపోతే ఏమవుతుందని లోకేశ్ ధ్వజమెత్తారు.