ఆర్థిక నేరాల కేసుల నుంచి ముఖ్యమంత్రి జగన్ తప్పించుకోలేరని.. శాసనమండలిలో ప్రతిపక్ష నాయకుడు యనమల రామకృష్ణ అన్నారు. ప్రజా ధనం దోచుకున్న వారు ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందేనని చెప్పారు. విచారణ వేగవంతం అయితే.. ముఖ్యమంత్రి జైలుకే పరిమితం అవుతారని పేర్కొన్నారు. ఈ కారణంగానే.. ప్రజల దృష్టి మరల్చేందుకు.. జగన్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
'సీఎం జగన్ కేసుల నుంచి తప్పించుకోలేరు'
పరిపాలన వికేంద్రీకరణ బిల్లు విషయంలో.. ప్రభుత్వ వ్యవహార శైలిని మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణ తప్పుబట్టారు. మండలిలో కొన్ని సవరణల తర్వాతే.. బిల్లు సెలెక్ట్ కమిటీకి వెళ్లిందని చెప్పారు. అలాగే... ఆర్థిక నేరాల కేసుల నుంచి సీఎం తప్పించుకోలేరని అన్నారు.
పరిపాల వికేంద్రీకరణ బిల్లుపై...
పరిపాలన వికేంద్రీకరణ బిల్లు విషయంలో.. ప్రభుత్వ వైఖరిని యనమల తప్పుబట్టారు. అధికారం ఉందని ఇష్టానుసారం చేసుకుపోవచ్చా అని ప్రశ్నించారు. శాసనసభ అనంతరం మండలిలో బిల్లు పెట్టి చర్చిస్తారని.. ఆ ప్రకారం బిల్లులో సవరణలు చేశాకే సెలెక్ట్ కమిటీకి పంపారని స్పష్టం చేశారు. 3 రాజధానుల బిల్లును మనీ బిల్లా లేదా ఆర్డినరీ బిల్లా అని కోర్టు అడిగిందన్న యనమల... ఆర్డినరీ, మనీ బిల్లుకు పద్ధతులు వేర్వేరుగా ఉంటాయని చెప్పారు. ఎస్సీ కమిషన్, ఆంగ్ల మాధ్యమం బిల్లులు ఆర్డినరీగా వచ్చాయని.. అసలు మంత్రులు వాటిని చదువుతున్నారో లేదో అని అనుమానం వ్యక్తం చేశారు.