తాము ప్రవేశపెట్టిన పథకాలకే పేర్లు మార్చి వైకాపా అమలు చేస్తోందని.. తెలుగుదేశం పార్టీ నేత ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. వైకాపా ప్రభుత్వం లబ్ధిదారుల సంఖ్యలో కోతలు విధించిందన్నారు. ఇష్టం లేదంటూనే పథకాల ప్రచారానికి భారీగా ఖర్చు పెడుతున్నారని.. గోరంత పని చేస్తూ కొండంత ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్రంలో 6 లక్షల ఆటోలు ఉంటే.. 2 లక్షల ఆటో యజమానులకే సాయం చేశారని ఎద్దేవా చేశారు.
నవశకం నిధులు ఎమ్మెల్యేల కళాశాలల ఖాతాల్లో ..
గత ప్రభుత్వాలు విద్యార్థులకు వసతి ఖర్చుల కింద ఉపకారం వేతనాలు ఇచ్చాయని.. వాటికే జగనన్న వసతి, జగనన్న దీవెన పేర్లు పెట్టుకున్నారని మండిపడ్డారు. వైఎస్‌ఆర్ నవశకం పేరుతో వైకాపా ఎమ్మెల్యేల కళాశాలలకు ఫీజ్ రీయింబర్స్‌మెంట్ నిధులు దోచిపెడుతున్నారని ఆరోపించారు. మంచి కళాశాలలకు తక్కువ రుసుం చెల్లిస్తూ, వైకాపా ఎమ్మెల్యేల కళాశాలలకు ఎక్కువ ఫీజులు చెల్లిస్తున్నారని.. నాక్‌లో మంచి గుర్తింపు ఉన్న కళాశాలకు రూ.34 వేలు మాత్రమే ఇస్తున్నారన్నారు.
ప్రభుత్వ పథకాల పేరుతో అయినవాళ్లకు దోచిపెడుతున్నారని ధ్వజమెత్తారు. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని ఇప్పటివరకు నిధులే ఇవ్వలేదని.. డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ రుణ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.3 లక్షలకు తగ్గించారని ధూళిపాళ్ల అన్నారు.
ఇవీ చదవండి...రాష్ట్ర ఆర్థికాభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలి: యనమల