'హూ కిల్డ్ బాబాయ్' అనే స్లోగన్‌కు జగన్ భయపడి తనపైకి మంత్రులను పంపారని మాజీ మంత్రి దేవినేని ఉమా మండిపడ్డారు. కృష్ణాజిల్లా పమిడిముక్కల పోలీస్ స్టేషన్ నుంచి ఉద్రిక్తతల మధ్య ఆయన విడుదలయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. వైకాపా ప్రభుత్వ వేధింపులకు భయపడేది లేదన్నారు.
వైకాపా దుర్మార్గాలపై పోరాడుతాం..
మంత్రి కొడాలి నానిపై దేవినేని ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి సంస్కారహీనంగా మాట్లాడుతున్నారని అన్నారు. బాధ్యత కలిగిన మంత్రి ఇంత దారుణంగా మాట్లాడటం సరికాదని వ్యాఖ్యానించారు. దీక్ష చేస్తానంటే .. పోలీసులు అరెస్టు చేశారని అన్నారు. వైఎస్ వివేకా హత్యపై మాట్లాడితే సీఎం జగన్ భయపడుతున్నారని దేవినేని విమర్శించారు. పోలీసు కేసులకు తెదేపా నేతలు, కార్యకర్తలు భయపడరని స్పష్టం చేశారు. వైకాపా నేతల దుర్మార్గాలు, వ్యాఖ్యలపై మరింత పోరాటం చేస్తామని తేల్చి చెప్పారు.
అసలేం జరిగిందంటే...
గొల్లపూడిలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద దీక్ష చేపట్టేందుకు సిద్ధమైన తెదేపా నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును పోలీసులు అరెస్టు చేయడంతో ఉద్రిక్తత ఏర్పడింది. వివరాల్లోకి వెళితే... నిన్న మంత్రి కొడాలి నాని.. గొల్లపూడిలో దేవినేని ఉమాను ఉద్దేశించి తీవ్ర విమర్శలు చేశారు. మంత్రి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఉమా .. ఎన్టీఆర్ విగ్రహం వద్ద నిరసన దీక్ష చేపడతానని, దమ్ముంటే అడ్డుకోవాలని సవాల్ విసిరారు. ఆమేరకు ఈరోజు ఉదయం గొల్లపూడిలోని ఎన్టీఆర్ విగ్రహం వద్దకు తెదేపా శ్రేణులతో కలిసి ఉమా చేరుకున్నారు. ఉమా దీక్షకు సిద్ధమవుతుండగా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైకాపా శ్రేణులతో అక్కడికి చేరుకున్నారు. ఇరువర్గాలు అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. ఒకరిపై ఒకరు తీవ్ర వ్యాఖ్యలు చేసుకుంటూ బాహాబాహీకి దిగారు.
తీవ్ర గందరగోళం మధ్య ఎన్టీఆర్ విగ్రహం వద్ద దేవినేని ఉమా బైఠాయించారు. పరిస్థితి అదుపుతప్పే అవకాశం ఉండటంతో పోలీసులు ఉమాను అరెస్టు చేశారు. పోలీసు వాహనంలో స్టేషన్‌కు తరలిస్తుండగా ఈలప్రోలు వద్ద మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆధ్వర్యంలో మహిళలు అడ్డుకున్నారు. రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దేవినేని ఉమాను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తీరుపై ఉమా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వస్తే పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారని మండిపడ్డారు.
ఇదీ చదవండి:దేవినేని ఉమ అరెస్టు.. గొల్లపూడిలో టెన్షన్ టెన్షన్