జగన్ ప్రభుత్వం డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలకు రేట్లు పెట్టి అనుకూలమైన యంత్రాంగాన్ని ప్రతి స్టేషన్లో వేయించుకుందని ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆరోపించారు. డబ్బులు తీసుకుని పోలీసులకు పోస్టింగులు ఇస్తే... సలాం లాంటి సంఘటనలే జరుగుతాయని ధ్వజమెత్తారు. ఆంధ్రా పోలీసులకు ఉన్న మంచిపేరును జగన్ ప్రభుత్వం చెడకొడుతోందని దుయ్యబట్టారు.
100 మంది డీఎస్పీలకు పదోన్నతలు వస్తే కేవలం 40మందికి పోస్టింగ్‌లు ఇచ్చి తెదేపా ప్రభుత్వంలో పనిచేశారనే అక్కసుతో 60 మందిని పక్కన పెట్టారని మండిపడ్డారు. నంద్యాల ఎమ్మెల్యే రవి చంద్రారెడ్డి ప్రధాన అనుచరుడే పోలీసులపై ఒత్తిడి తెచ్చి సలాంపై తప్పుడు కేసు పెట్టించారన్న బుద్ధా వెంకన్న... కుటుంబం ఆత్మహత్యకు కారణమైన డీఎస్పీ, సీఐ, హెడ్ కానిస్టేబుల్‌పై హత్యాయత్నం కేసులు నమోదు చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.