జగన్ హిందూత్వంపై ఎక్కుపెట్టిన గన్ అని తెదేపా ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ధ్వజమెత్తారు. పిఠాపురంలో దేవతా విగ్రహాలు ధ్వంసం చేయించటంతో పాటు సింహాద్రి అప్పన్నకి చెందిన 60 వేల కోట్ల విలువ చేసే మాన్సాస్ భూములు మింగాలని చూస్తున్నారని ఆరోపించారు.
జగనే హిందుత్వంపై ఎక్కుపెట్టిన గన్: బుద్దా వెంకన్న - amaravathi news
హిందూత్వంపై ఎక్కుపెట్టిన గన్ జగనేనని తెదేపా ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆరోపించారు. మూర్ఖత్వం, క్రూరత్వం తప్ప దేవుడు అంటే నమ్మకం లేని వాడు జగన్ అని ట్విట్టర్ వేదికగా విమర్శించారు.

నెల్లూరు జిల్లా కొండబిట్రగుంటలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారిని తీసుకువెళ్లే రథాన్ని తగలబెట్టించారని బుద్దా మండిపడ్డారు. అంతర్వేదిలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో 40 అడుగుల పవిత్ర రథాన్ని తగలబెట్టించటంతో పాటు... తిరుమల వెంకన్న సన్నిధిలో అన్యమత ప్రచారం చేయించారని ధ్వజమెత్తారు. శ్రీకాళహస్తి గుడిలో క్షుద్ర పూజలు చేయించి.... తాడేపల్లి గోశాలలో గోవులను బలితీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూర్ఖత్వం, క్రూరత్వం తప్ప దేవుడు అంటే నమ్మకం లేని వ్యక్తి జగన్ అంటూ ట్విట్టర్ ద్వారా బుద్దా వెంకన్న తీవ్ర ఆరోపణలు చేశారు.