Bonda Uma: నిజనిర్ధారణ కమిటీని ఎందుకు అడ్డుకున్నారో మంత్రి కొడాలి నాని చెప్పాలని తెదేపా సీనియర్ నేత బొండా ఉమా ప్రశ్నించారు. గుడివాడలో కొడాలి నానికి చెందిన కె-కన్వెన్షన్ సెంటర్‌లో సంక్రాంతి సందర్భంగా క్యాసినో నిర్వహించినట్లు ఆరోపణలొచ్చాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం తెదేపా నిజనిర్ధారణ కమిటీ కన్వెన్షన్ సెంటర్‌ను పరిశీలించడానికి వెళ్లడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. దీనిపై కొడాలి నాని కూడా దీనిపై స్పందిస్తూ క్యాసినో, పేకాట నిర్వహించారని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకొని, పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటానని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో బొండా ఉమా విజయవాడలో మీడియాతో మాట్లాడారు.
‘‘కొడాలి నాని దొరికిపోయి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. మంత్రి సవాల్‌ను స్వీకరిస్తున్నాం. క్యాసినో జరిగిందని నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం. ఎప్పుడు రావాలో చెప్పండి. చెరో పెట్రోల్ డబ్బా తెచ్చుకుందాం.. తేల్చుకుందాం. క్యాసినోలో డ్యాన్స్‌లు వేసిన వారి పేర్లూ మా వద్ద ఉన్నాయి. విక్టర్, శశిభూషణ్ వంటి వాళ్లు డ్యాన్స్‌లు వేశారు. కరోనా వచ్చిందని హైదరాబాద్‌లో ఉంటే చేసిన తప్పులు పోతాయా?
క్యాసినో జరగలేదంటే పెట్రోల్ పోసుకునేందుకు నేను సిద్ధం. రుజువైతే మంత్రి పదవికి రాజీనామా చేయి చాలు. క్యాసినో జరిగిందని మీడియా సమక్షంలో నిరూపణకు సిద్ధం. అర్ధనగ్న నృత్యాలు జరిగితే తానే ఆపించానని నాని ఒప్పుకొన్నారు’’అని బొండా ఉమా అన్నారు. ఈ సందర్భంగా ఆయన కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన క్యాసినో వీడియోలను మీడియాకు విడుదల చేశారు.
రౌడీయిజానికి గుడివాడను వేదికగా మార్చారు: కొనకళ్ల నారాయణరావు
గోవా తరహా జూదాలకు, రాయలసీమ తరహా రౌడీయిజానికి గుడివాడను వేదికగా మార్చిన ఘనత వైకాపా ప్రభుత్వానికే దక్కుతుందని మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు ద్వజమెత్తారు. బూతులు తిడుతున్న బూతుల మంత్రి కొడాలి నానిని అదుపు చేయడంలో సీఎం జగన్ విఫలమవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశాంతమైన గుడివాడలో అరాచక శక్తులు రాజ్యమేలుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. క్యాసినో జూదాలపై నిజ నిర్ధారణ చేసేందుకు వెళ్లిన తమను అరెస్ట్ చేసిన పోలీసులు తమపై దాడి చేసిన వారిని ఎందుకు అరెస్ట్ చేయలేదో చెప్పాలన్నారు. శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులు వైసీపీ గూండాలతో కుమ్మక్కయ్యారని విమర్శించారు.
ఇదీ చదవండి:
Maoist : మావోయిస్టుల దుశ్చర్య...12 వాహనాలకు నిప్పు