ఎంపీ గోరంట్ల వీడియో కేసులో.. తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన స్క్రిప్ట్ ను తు.చ. తప్పకుండా ఎస్పీ ఫకీరప్ప చదివారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమా ఆరోపించారు. ఈ కేసును నీరుగార్చి, విషయాన్ని దారి మళ్లించేందుకు ఎస్పీ పొంతన లేని సమాధానాలు చెప్పారని మండి పడ్డారు. ఒరిజినల్ వీడియో ఒక వ్యక్తి వద్ద ఉందని.. రెండో వ్యక్తి దానిని చూస్తుంటే, మూడో వ్యక్తి రికార్డ్ చేశాడని ఎస్పీనే చెప్పారని.. దీన్నిబట్టి ఒరిజినల్ వీడియో ప్రభుత్వం వద్దనే ఉందని నిర్ధారణ అయిందన్నారు.
నగ్న వీడియోను ఫోరెన్సిక్ కి ల్యాబ్‌కు పంపామని ప్రభుత్వ పెద్దలు చెప్తే.. అసలు ల్యాబ్ కే పంపలేదని ఎస్పీ నిర్ధారించారని అన్నారు. ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికను ఎస్పీ మీడియా సమావేశంలో వెల్లడిస్తారని భావిస్తే.. తన సొంత అజెండాతో బోగస్ విచారణను వివరించారని ఆరోపించారు. పతనమవుతున్న వైకాపా కు అడ్డుకట్ట వేసేవిధంగా ఎస్పీ మాట్లాడారని.. ఆయన వివరణ చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఒక వ్యక్తి ఫోన్లో రికార్డ్ అయిన వీడియోను, మరో వ్యక్తి ప్లే చేస్తే.. మూడో వ్యక్తి రికార్డు చేశారంటున్న ఎస్పీ.. ఆ ముగ్గురు ఎవరో చెప్పాలని డిమాండ్ చేశారు.