NCC Lands: ముఖ్యమంత్రి జగన్ తన కొత్త కేబినెట్‌లో తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణకు చోటు కల్పించడంతో పాటు, ఉపముఖ్యమంత్రి పదవిని కూడా కట్టబెట్టడంతో... విశాఖలోని మధురవాడలో 97.30 ఎకరాల భూమిని ఎన్‌సీసీ సంస్థకు కారు చౌకగా రూ.187 కోట్లకే విక్రయించిన వ్యవహారం మళ్లీ చర్చనీయాంశమైంది. ఎన్‌సీసీ సంస్థ ఆ భూమిని రూ.200 కోట్లకు బెంగళూరుకి చెందిన జీఆర్‌పీఎల్ అనే కంపెనీకి అమ్మేసినట్టు వార్తలు రావడం, ఆ కంపెనీ కొట్టు సత్యనారాయణ తమ్ముడు కొట్టు మురళీకృష్ణది కావడంతో... దీని వెనుక భారీ క్విడ్ ప్రో కో (నీకది-నాకిది) వ్యవహారం ఉందని విపక్షాలు తీవ్రస్థాయిలో ఆరోపిస్తున్నాయి.
మధురవాడలో 97.30 ఎకరాల్ని ఎన్‌సీసీ సంస్థకు చెందిన ప్రత్యేక వాహక సంస్థ ఎన్‌సీసీవీయూఐఎల్‌కి ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ బోర్డు 2021 అక్టోబరులో రూ.187 కోట్లకు పూర్తి హక్కులతో విక్రయించింది. ఆ భూమి చేతికి వచ్చాక ఎన్‌సీసీవీయూఐఎల్‌ని ఎన్‌సీసీ సంస్థ జీఆర్‌పీఎల్‌కి విక్రయించినట్టు ఇటీవల వార్తలు వచ్చాయి. ఆ భూమిని శరవేగంగా ఎన్‌సీసీకి రిజిస్ట్రేషన్ చేయడం, నాలుగు నెలల్లోనే ఆ భూమిని జీఆర్‌పీఎల్‌కి ఎన్‌సీసీ విక్రయించడం, ఆ వెంటనే కొట్టు సత్యనారాయణకు ఉపముఖ్యమంత్రి పదవి దక్కడం క్విడ్ ప్రో కో కాక మరేమిటని విశాఖకు చెందిన తెదేపా సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ప్రశ్నిస్తున్నారు. ‘‘జగన్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై కొన్ని రోజులుగా బయట చర్చ జరుగుతున్నా... మంత్రి పదవి దక్కే అవకాశం ఉన్నవారిలో కొట్టు సత్యనారాయణ పేరు ఎప్పుడూ వినపడలేదు. ఇప్పుడు హఠాత్తుగా ఆయనకు కీలకమైన పదవి దక్కడంలోని ఆంతర్యం ఏమిటి?’’ అని ఆయన ప్రశ్నించారు.