Adan distilleries: అదాన్ డిస్టిలరీస్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి, వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిలకు సంబంధించినదేనని తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ఆరోపించారు. ఆ కంపెనీలో డైరెక్టరైన కాశీచాయనుల శ్రీనివాస్.. విజయసాయిరెడ్డి అల్లుడు పెనక రోహిత్‌రెడ్డికి చెందిన పలు కంపెనీల్లోనూ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారని వివరించారు.
అరబిందో లేక్‌వ్యూ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్, టెనెట్ బయోలాజికల్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రేయాస్ బయోలాజికల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల్లో రోహిత్‌రెడ్డితో పాటు కాశీచాయనుల శ్రీనివాస్ కూడా డైరెక్టర్‌గా ఉన్నారని వెల్లడించారు. దీన్ని బట్టే.. విజయసాయిరెడ్డి అల్లుడికి అదాన్ డిస్టిలరీస్‌తో ఉన్న సంబంధం స్పష్టమైపోయిందని, అది వారి బ్రోకరేజి కంపెనీ అని తేలిపోయిందని అన్నారు.
దమ్ము, ధైర్యం ఉంటేే అదాన్ డిస్టిలరీతో ఎలాంటి సంబంధం లేదని విజయసాయిరెడ్డి నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. ఈ విషయంపై తాను విజయసాయిరెడ్డితో చర్చకు సిద్ధమన్నారు. తాము చెప్పిన విషయాలకు సంబంధించిన పత్రాలన్నింటినీ తెలుగుదేశం పార్టీ వెబ్‌సైట్‌లో పెడుతున్నామని కావాలంటే చూసుకోవచ్చొని పేర్కొన్నారు. మంగళగిరిలోని తెదేపా జాతీయ కార్యాలయంలో తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి వరుణ్‌కుమార్‌తో కలిసి ఆదివారం ఆనం వెంకటరమణారెడ్డి విలేకరులతో మాట్లాడారు.
ఎవరి హయాంలో ఏర్పాటైంది? ..‘అదాన్ డిస్టిలరీస్‌లో జగన్‌మోహన్‌రెడ్డి, విజయసాయిరెడ్డి, అతని అల్లుడికి ఎంత మేర వాటాలు ఉన్నాయో చెప్పాలి. చంద్రబాబు హయాంలోనే డిస్టిలరీల ఏర్పాటుకు అనుమతులు ఇచ్చారని, వైకాపా ప్రభుత్వం ఒక్క డిస్టిలరీకీ అనుమతి ఇవ్వలేదని విజయసాయిరెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అదాన్ డిస్టిలరీ ఎవరి హయాంలో ఏర్పాటైంది? 2019 డిసెంబరు 2న ఆ సంస్థను స్థాపించారు. అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబా? జగన్‌మోహన్‌రెడ్డా? ఈ కంపెనీ ఏర్పాటు చేసిన రెండున్నరేళ్లలోనే రూ.2,400 కోట్ల విలువైన మద్యం అమ్మారు.
ఏడాదిలోనే వారికి రూ.1,500 కోట్లు మిగిలింది. అదృష్టం కలిసొస్తే నడిచొచ్చే కొడుకు వస్తాడన్న మాదిరి జగన్‌రెడ్డికి అదాన్ కంపెనీ అలాంటిదే. దీనికి సొంతంగా ఒక్క డిస్టిలరీ ప్లాంటు కూడా లేదు. వేరే వారి డిస్టిలరీలను లీజుకు తీసుకుని విషపూరిత మద్యాన్ని తయారు చేసి ప్రజలపైకి విడిచిపెడుతున్నారు. క్వార్టర్ పరిమాణం తయారీకి కనీసం రూ.10 కూడా ఖర్చు కాదు. అయినా దాన్ని రూ.160కు అమ్ముతున్నారు’ అని ఆనం వెంకటరమణారెడ్డి వివరించారు. ప్రజల ప్రాణాలు తీస్తూ కోట్లు కొల్లగొడుతున్నారని, డబ్బు కోసం జనాల్ని చంపేస్తారా అని ఆయన ప్రశ్నించారు.
ఒకే చిరునామాతో అల్లుడివి 19 కంపెనీలు..‘హైదరాబాద్‌లోని మియాపూర్‌లోని 1-121/1, సర్వే నెంబర్ 66 (పార్ట్), 67 (పార్ట్)లో ఒకే చిరునామాతో యాక్సిస్ క్లినికల్స్ లిమిటెడ్, అరబిందో లేక్‌వ్యూ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్, రక్షణ్ టెక్నాలజీస్ ఎల్‌ఎల్‌పీ, అరబిందో తత్వ టౌన్‌షిప్ డెవలపర్స్ ఎల్‌ఎల్‌పీ, శ్రేయాస్ బయోలాజికల్ ప్రైవేట్ లిమిటెడ్, టెనెట్ బయోలాజికల్ ప్రైవేటు లిమిటెడ్, అరో నాచురల్ రిసోర్సెస్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రేయస్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, అరో లోకల్ ప్రైవేట్ లిమిటెడ్, అన్నవరం ఇన్‌ఫ్రా వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్, అరో ఇండస్ట్రీయల్ పార్క్స్ ప్రైవేట్ లిమిటెడ్, అరో పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, మహిరా ఇన్‌ఫ్రా రియల్టీ లిమిటెడ్, బాంబే బ్యాడ్మింటెన్ ప్రైవేట్ లిమిటెడ్, శాన్‌హోక్ హాస్పిటలిటీ ఎల్‌ఎల్‌పీ, ట్రైడెంట్ అండ్ అరో మైనింగ్ ఎల్‌ఎల్‌పీ, జోయలో డిజీ హెల్త్ ప్రైవేట్ లిమిటెడ్, అరబిందో రియల్టీ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్, అరబిందో తత్వ శ్రీ హిల్స్ ఎల్‌ఎల్‌పీ, ఎష్యూర్ ప్రాజెక్ట్స్ డెవలపర్స్ ఎల్‌ఎల్‌పీ కంపెనీలు ఉన్నాయి.
వీటిలో అత్యధిక సంస్థల్లో విజయసాయిరెడ్డి అల్లుడు పెనక రోహిత్‌రెడ్డి డైరెక్టర్‌గా ఉన్నారు. మరో 30 నుంచి 50 కంపెనీలు ఇదే చిరునామాతో ఉన్నాయి..’ అని ఆనం వెంకటరమణారెడ్డి వివరించారు.
ఎందుకు సమాధానం చెప్పట్లేదు?..‘సిల్వర్ స్ట్రైప్స్, ఆంధ్రా గోల్డ్, నైన్ సీ హార్స్ విస్కీల్లో విష రసాయనాలు ఉన్నాయని మేము చెబుతుంటే.. మంత్రి అంబటి రాంబాబు, వైకాపా నేతలు దానికి సమాధానం చెప్పకుండా డిస్టిలరీలకు చంద్రబాబు హయాంలో అనుమతులిచ్చారని మాట్లాడటం సిగ్గు చేటు’ తెలుగు యువత అధికార ప్రతినిధి వరుణ్‌కుమార్ పేర్కొన్నారు. జగన్‌రెడ్డి మనుషులు డిస్టిలరీలను కబ్జా చేసి విషపు మద్యం తయారు చేస్తున్నారు. మద్యపాన నిషేధం చేస్తామన్న జగన్‌రెడ్డి ఆయన హయాంలో 6 డిస్టిలరీలకు ఎందుకు అనుమతిచ్చారు?’ అని ప్రశ్నించారు.
ఇవీ చూడండి: