"ఇసుక కొరత నిరసిస్తూ ఈనెల 25న ఆందోళనలు" - tdp serious on YCP governament over sand problems
ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన ఇసుక విధానం వైకాపా నేతలకు, ఇసుక మాఫియాకు మేలు చేసేందుకేనని తెదేపా నేత, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ విమర్శించారు. ప్రభుత్వ వైఖరి నిరసిస్తూ ఈనెల 25న రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చినట్టు పేర్కొన్నారు.

నూతన ఇసుక విధానంపై తెలుగుదేశం నేతలు మరోసారి విరుచుకుపడ్డారు. కొత్త పాలసీతో సామాన్య ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని... వైకాపా నేతలకు, ఇసుక మాఫియాకే మేలు జరుగుతోందని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆరోపించారు. గుంటూరులోని తెదేపా రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన... ఇసుక కొరతతో 30 లక్షల మంది కార్మికులు రోడ్డున పడ్డారని అన్నారు. గతంలో కంటే ఇసుక తక్కువ ధరకు ఇస్తామని చెప్పి ప్రభుత్వ పెద్దలు మాట తప్పారని ధ్వజమెత్తారు. వరద కారణంగా ఇసుక కొరత ఏర్పడిందని చెబుతున్న ప్రభుత్వం... అక్రమ రవాణాపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కొరత నిరసిస్తూ ఈ నెల 25న రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడుతున్నట్టు తెలిపారు.