మొక్కల పెంపకంలోనూ వైకాపా నేతలు అవినీతికి పాల్పడుతున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. జగనన్న పచ్చతోరణం పేరుతో ముఖ్యమంత్రి జగన్.. వైకాపా నేతల అవినీతికి తోరణం పరిచారని ధ్వజమెత్తారు. పర్యావరణ, అటవీ చట్టాలు ఉల్లంఘించి అడవుల్లో చెట్లను నరికి.. కోట్లాది రూపాయలు అవినీతి చేస్తున్న వైకాపా నేతలకు మొక్కలు నాటడం పేరుతో ప్రభుత్వ నిధుల్ని దోచి పెడుతున్నారని దుయ్యబట్టారు. వైకాపా కార్యకర్తలకు లబ్ధి చేకూర్చే విధంగా.. మొక్కల నిర్వహణ బాధ్యత కింద ఒక్కో మొక్కకు ఉపాధి హామీ నిధులు ఖర్చు చేస్తున్నారని విమర్శించారు.
వైకాపా నేతలు గత రెండేళ్లలో ఎన్ని మెక్కలు నాటి, ఎన్నింటిని బతికించారో లెక్కలు చెప్పాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. అక్రమ మైనింగ్ కోసం ప్రకృతి సంపదను ధ్వంసం చేస్తూ కొండపల్లి బొమ్మల తయారీకి ఉపయోగపడే తెల్లపోనంకి, కాకినాడలో తుపాన్లకు రక్షణగా నిలిచే మడ అడవుల్ని నరికేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ మైనింగ్ రవాణా కోసం విశాఖ ఏజెన్సీలో 14 మీటర్ల మేర రహదారి ఏర్పాటు కోసం వేలాది చెట్లు నరికేశారన్నారు. అక్రమ సంపాదన కోసం చెట్లు, అడవులు నరుకుతూ.. జగనన్న పచ్చతోరణం పేరుతో ప్రభుత్వ నిధుల్ని దోచి పెట్టడం సరికాదని హితవు పలికారు.