కరోనా కష్ట కాలంలో..... తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి 10 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించాలని కృష్ణా జిల్లా వీరులపాడులో తహశీల్దార్‌కు వినతిపత్రం అందించారు. కొవిడ్‌తో మృతి చెందిన కుటుంబాలకు 10 లక్షలు చెల్లించాలని పెనమలూరులో తెదేపా నేతలు డిమాండ్ చేశారు. కరోనా బాధితులను ఆదుకోవాలంటూ మైలవరంలో మాజీ మంత్రి దేవినేని ఉమా స్థానిక తహసీల్దార్‌కు వినతిపత్రం అందించారు. అనంతరం అయ్యప్పనగర్‌లో ఇళ్ల స్థలాల లే అవుట్‌ను సందర్శంచిన ఆయన... తమ హయాంలో నిర్మించిన ఇళ్లను లబ్ధిదారులకు ఇప్పటివరకూ పంపిణీ చేయలేదని దుయ్యబట్టారు. 10 డిమాండ్‌లతో కూడిన వినతి పత్రాన్ని విజయవాడ పటమట తహసీల్దార్‌కు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఎమ్మెల్సీ అశోక్‌బాబులు అందించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో తెదేపా నేతలు, తెనాలిలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర నిరసన వ్యక్తం చేశారు.
తూర్పుగోదావరి జిల్లాలోనూ తెలుగుదేశం నేతలు ఆందోళనలు నిర్వహించారు. వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయాలని... అమలాపురంలో మాజీ ఎమ్మెల్యే నిరసన వ్యక్తం చేశారు. అనపర్తి, రంగంపేట, కిర్లంపూడి, జగ్గంపేట, గండేపల్లి, రావులపాలెం, ఆత్రేయపురం, ఆలమూరు, కొత్తపేటలో ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ తెలుగుదేశం నేతలు ఆందోళన చేశారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో తెదేపా నేతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
నెల్లూరు జిల్లా ఆత్మకూరు, ఉదయగిరి, దత్తలూరు, వరికుంటపాడు, జలదంకిలో తెదేపా నేతలు ఆందోళనలు నిర్వహించారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో డిమాండ్లతో కూడిన ప్లకార్డులను పూల వృక్షానికి వేలాడ దీసి నిరసన తెలిపారు. కరోనాతో తల్లిదండ్రులు మరణించి అనాథలైన చిన్నారులను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరారు. కరోనా మృతుల వివరాలను రాష్ట్ర ప్రభుత్వం దాచిపెడుతోందని గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆరోపించారు. చీరాల, పర్చూరు, మార్టూరు, కారంచేడు, చినగంజాంలోనూ తెలుగుదేశం నేతలు నిరసన వ్యక్తం చేశారు. తిరుపతి అర్బన్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఆందోళనకు దిగారు. జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా గుర్తించి..... 50లక్షల బీమా అందించాలని డిమాండ్ చేశారు.