భూములు ఇచ్చిన రైతులు లాఠీ దెబ్బలు తిన్న ఘటన దేశ చరిత్రలోనే ఎక్కడా లేదని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. వైకాపా ప్రభుత్వం ఏడాది పాలనపై ఆయన ట్విట్టర్లో స్పందించారు. రాజధాని అమరావతి రైతుల పట్ల పోలీసుల దాడులకు సంబంధించిన వీడియోను చంద్రబాబు.. తన సందేశానికి జత చేశారు.
రోడ్డుకు అడ్డంగా గోడ కట్టి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. బడుగుల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్ మూసేవేసి,పేదవాడి కడుపు కొట్టారని ఆక్షేపించారు.
"మాట తప్పుడు, మడమ తిప్పుడు వంశానికి సీఎం జగన్ వారసుడు" అని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. ఏడాది పాలనలో ప్రభుత్వ కార్యాలయాలకు వైకాపా రంగులు వెయ్యడం తప్ప ప్రజలకు చేసింది శూన్యమని విమర్శించారు. నవరత్నాల పేరుతో నవ మోసాలకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజావేదిక కూల్చివేత నుంచి సామాన్యుడిపై కరెంటు బిల్లుల మోత వరకు ఒక్క ఏడాదిలో రాష్ట్రాన్ని కల్లోలం సృష్టించారన్నారు.