పాదయాత్రలో ఇచ్చిన హామీకి విరుద్ధంగా ముఖ్యమంత్రి జగన్‌మెహన్‌రెడ్డి వ్యవహరిస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచి సామాన్య ప్రజల నడ్డి విరిచేలా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఆర్టీసీ ఛార్జీల పెంపుతో ప్రజలపై ఏటా 1000 కోట్ల రూపాయలకు పైగా భారం పడనుందని... దీనిని తెదేపా తీవ్రంగా ఖండిస్తోందని ఓ ప్రకటనలో తెలిపారు. ఆర్టీసీ ఛార్జీలు పెంచబోమని ఎన్నికల ముందు ఊరూవాడ ప్రచారం చేసి ప్రజలను నమ్మించి మోసం చేశారన్నారు. ఒకవైపు నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో ఇబ్బందులకు గురవుతున్న ప్రజలకు... ఛార్జీల పెంపు మరింత భారం కానుందని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. ఐదేళ్ల తెలుగుదేశం హయాంలో పేదలపై ఎటువంటి భారం పడకుండా ఆర్టీసీని బలోపేతం చేసి మెరుగైన సేవలను అందించామని కళా వివరించారు. ప్రజల సౌకర్యాలను పక్కన పెట్టి ఆర్టీసీ ఛార్జీలను పెంచడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. ఆర్టీసీ ఛార్జీల పెంపునకు నిరసనగా తెదేపా ఆధ్వర్యంలో ప్రజలతో కలిసి అన్ని ఆర్టీసీ బస్ స్టాండ్, డిపోల వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహించనుందని ఆయన తెలిపారు. పెంచిన ఛార్జీలను తగ్గించకుంటే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
'ప్రజల సౌకర్యాలను గాలికొదిలి... ఛార్జీల పెంపు ఏంటి?' - ఏపీఎస్ఆర్టీసీ ఛార్జీలు
సామాన్య ప్రజల నడ్డి విరిచేలా వైకాపా సర్కార్ వ్యవహరిస్తోందని తెదేపా నేత కళా వెంకట్రావు దుయ్యబట్టారు. ఒకవైపు నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో ఇబ్బందులకు గురవుతున్న ప్రజలకు... ఛార్జీల పెంపు మరింత భారం కానుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
కళా వెంకట్రావు(పాతచిత్రం)