ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 11, 2021, 11:55 PM IST

ETV Bharat / city

'కొవిడ్‌ కట్టడి చర్యలపై జిల్లాలవారీగా శ్వేతపత్రం విడుదల చేయాలి'

కొవిడ్ నివారణకు ప్రభుత్వం తీసుకున్న చర్యలపై జిల్లాల వారీగా శ్వేతపత్రం విడుదల చెయ్యాలని తెదేపా, కాంగ్రెస్ సీపీఐలు సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. ఆక్సిజన్ అందక కరోనా రోగులు చనిపోయిన ఘటనల నుంచి పాఠాలు నేర్చుకోకపోవడం సిగ్గుచేటని పార్టీలు విమర్శించాయి. ప్రత్యర్థులపై అక్రమ కేసులు, కక్ష సాధింపు చర్యలతో సమయాన్నంతా సీఎం జగన్మోహన్ రెడ్డి వృథా చేస్తున్నారని నేతలు మండిపడ్డారు.

తెదేపా, కాంగ్రెస్, సీపీఐ
తెదేపా, కాంగ్రెస్, సీపీఐ

ఆక్సిజన్ అందక కరోనా రోగుల మృతికి కారణమైన వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రతిపక్ష పార్టీలు తెదేపా, కాంగ్రెస్, సీపీఐ డిమాండ్ చేశాయి. కొవిడ్ నివారణకు ప్రభుత్వం తీసుకున్న చర్యలపై జిల్లాల వారీగా శ్వేతపత్రం విడుదల చెయ్యాలని తెదేపా, కాంగ్రెస్ సీపీఐ డిమాండ్ చేస్తూ సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ప్రతి జిల్లాల్లోనూ ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లను నిర్మించటంతో పాటు ప్రాణవాయువు సరఫరాకు అవసరమైనన్ని క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లు రవాణా పరికరాలు కొనుగోలు చేయాలని తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, పీసీసీ అధ్యక్షులు శైలజానాథ్, సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణలు డిమాండ్ చేశారు.

'అక్రమ కేసులపైనే ముఖ్యమంత్రి శ్రద్ధ'

ప్రపంచమంతా కరోనా కట్టడికి అవిశ్రాంతంగా శ్రమిస్తుంటే జగన్మోహన్ రెడ్డి మాత్రం ప్రత్యర్థులపై అక్రమ కేసులు, కక్ష సాధింపు చర్యలతో సమయాన్నంతా వృథా చేస్తున్నారని వారు మండిపడ్డారు. వైకాపా ప్రభుత్వ అసమర్థత, నిర్లక్ష్యానికి ప్రజలు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని అన్నారు. ప్రజలు ప్రాణాలు పోతుంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తనకు సంబంధం లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

'ప్రభుత్వం పొంతనలేని లెక్కలు చెప్తుంది'..

తిరుపతి రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక దాదాపు 25 మంది చనిపోతే, చెన్నై నుంచి సకాలంలో ఆక్సిజన్ రాకపోవడం వల్లేనని లెక్కలేనితనంతో తప్పించుకునే ప్రయత్నం చేయటం ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనమని విమర్శించారు. తిరుపతి, విజయనగరం, కర్నూలు, అనంతపురం, కదిరి, అమలాపురంలో ఆక్సిజన్ అందక కరోనా రోగులు చనిపోయిన ఘటనల నుంచి పాఠాలు నేర్చుకోకపోవడం సిగ్గుచేటని.. తక్షణమే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి అందరి సలహాలు, సూచనలతో లోటుపాట్లు సరిదిద్దాలని అన్నారు.

అందరికీ వాక్సిన్ వేయాలి..

18 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సు వారందరికీ ఉచితంగా వ్యాక్సిన్లు అందించాలని నేతలు డిమాండ్ చేశారు. వ్యాక్సిన్​ను విదేశీ కంపెనీల నుంచి దిగుమతి చేసుకునే అవకాశం కేంద్రం కల్పించినందున గ్లోబల్ టెండర్ల ద్వారా తక్షణమే చర్యలు చేపట్టాలని అన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులన్నింటికీ తగినంత ఆక్సిజన్ సరఫరా చేయటంతో పాటు లోటుపాట్లు సవరించి ఆక్సిజన్ సరఫరాను క్రమబద్దీకరించాలని ప్రకటనలో పేర్కొన్నారు.

చనిపోయిన వారికి రూ.10 లక్షలు చెల్లించాలి..

ప్రభుత్వాసుపత్రుల్లో సకాలంలో ఆక్సిజన్, మందులు అందక చనిపోయిన కొవిడ్ రోగుల వివరాలను తక్షణమే విడుదల చేయాలని.. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం అందచేయాలని డిమాండ్ చేశారు. అన్ని ప్రభుత్వాసుపత్రుల్లోని వైద్యులు, సిబ్బందికి సరిపడినన్ని పీపీఈ కిట్లు, ఇతర రక్షణ పరికరాలు అందుబాటులోకి తేవాలని సంయుక్త ప్రకటనలో తెలిపారు. తిరుపతి రుయా ఆస్పత్రి ఘటన మృతులతో పాటు కొవిడ్​తో చనిపోయిన వారికి తెదేపా, కాంగ్రెస్, సీపీఐ నేతలు సంతాపం ప్రకటించారు. కర్ఫ్యూ నిబంధనలను పాటిస్తూ మృతుల కుటుంబాలకు సంఘీభావంగా బుధవారం సాయంత్రం నివాసాల వద్దే కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టాలని నేతలు నిర్ణయించారు.

ఇదీ చదవండి:

ఆక్సిజన్ కేటాయింపు, సరఫరా పెంచాలంటూ.. ప్రధానికి సీఎం జగన్ లేఖ

దేశం 'లాక్​డౌన్'- అన్ని రాష్ట్రాల్లో ఆంక్షలు!

ABOUT THE AUTHOR

...view details