TDP RALLIES SUPPORTING AMARAVATHI FARMERS: అమరావతి రైతులకు సంఘీభావంగా రాష్ట్రవ్యాప్తంగా.. తెదేపా శ్రేణులు భారీ ప్రదర్శనలు నిర్వహించారు. గుంటూరు జిల్లా వేమూరులో ఎన్టీఆర్ పురవేదిక నుంచి రైల్వే స్టేషన్ ప్రధాన కూడలి వరకు భారీ ప్రదర్శన చేపట్టారు. అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలని నినదించారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో తెదేపా శ్రేణులు ర్యాలీ నిర్వహించారు. టెక్కలిలో పార్టీ జెండాలతో తెదేపా నేతలు పట్టణ వీధుల్లో ర్యాలీ తీశారు.
విజయనగరం జిల్లాలో అమరావతి రైతులకు.. పెద్ద ఎత్తున తెదేపా శ్రేణులు సంఘీభావం తెలిపారు. విజయనగరంలో కోట కూడలి నుంచి గంట స్తంభం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. "3 రాజధానులు వద్దు.. అమరావతి ముద్దు" అంటూ విశాఖ జిల్లా అనకాపల్లిలో ప్రదర్శన చేపట్టారు. 3 రాజధానుల నిర్ణయాన్ని సర్కారు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో తెదేపా నాయకులు పాదయాత్ర చేశారు. ప్రకాశం జిల్లా దర్శిలోనూ తెదేపా నేతలు సంఘీభావ ర్యాలీ నిర్వహించారు.