వైకాపాకు 22మంది ఎంపీలు, మరో ఆరుగురు రాజ్యసభ సభ్యులు ఉన్నా.. పోలవరం నిధులు తీసుకురాలేకపోవటం వారి అసమర్థతేనని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు నిమ్మకాయల చినరాజప్ప దుయ్యబట్టారు. కేసుల మాఫీ, స్వార్థ రాజకీయాల కోసం రాష్ట్ర భవిష్యత్తును తాకట్టు పెట్టారని ధ్వజమెత్తారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోకుండానే 7మండలాలు విలీనం అయ్యేలా చేయటంతో పాటు.. ప్రతి సోమవారాన్ని పోలవరంగా మార్చుకోవటం వల్ల 71శాతం పనులు పూర్తయ్యాయని స్పష్టం చేశారు.
వైకాపా అసమర్థత వల్లే పోలవరానికి నిధులు రావడం లేదు: తెదేపా
పోలవరం ప్రాజెక్టుకు నిధులు తీసుకురాలేకపోవటం వైకాపా నేతల వైఫల్యమేనని తెదేపా నేతలు మండిపడ్డారు. వైకాపా ఎమ్మెల్యేలు, ఎంపీల ఇళ్లఎదుట బైఠాయించి.. పోలవరం పూర్తి చేయాలని డిమాండ్ చేయాలని ప్రజలకు తెదేపా నేతలు సూచించారు.
ఈ ప్రాజెక్టు ఆలస్యమైన కొద్దీ ఖర్చు పెరుగుతుందని వేగంగా పనులు చేయించారన్న రాజప్ప.. 2019లో సాంకేతిక సలహా కమిటీ 55 వేలకోట్ల రూపాయల అంచనాలకు ఆమోదం తెలిపిందని గుర్తు చేశారు. నీతి ఆయోగ్ సూచన మేరకే పోలవరం నిర్మాణ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని విద్యుత్ కేంద్రం ఖర్చు మాత్రం పెట్టుకుంటుందని వెల్లడించారు. ప్రాజెక్టు, ఆర్ అండ్ ఆర్ వ్యయం కేంద్రమే భరిస్తుందని పలుమార్లు స్పష్టత ఇచ్చినా.. కేంద్రంతో నేరుగా మాట్లాడకుండా తెదేపాను మంత్రులు విమర్శిస్తున్నారని అన్నారు. మంత్రి కన్నబాబుకు చంద్రబాబును విమర్శించే స్థాయిలేదని మండిపడ్డారు.
పోలవరం ప్రాజెక్టు పూర్తయితేనే.. రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని.. తెలుగుదేశం పార్టీ కర్నూలు పార్లమెంటు అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు తెలిపారు. సీఎం జగన్ హయాంలో పోలవరం పూర్తికాదని.. కనీసం పెండింగ్ పనులు 30 శాతం కూడా పూర్తిచేయలేని దౌర్భాగ్యస్థితిలో ఆయన ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైకాపా ఎమ్మెల్యేలు, ఎంపీల ఇళ్లఎదుట బైఠాయించి.. పోలవరం పూర్తి చేయాలని డిమాండ్ చేయాలని ప్రజలను కోరారు. తెలుగుదేశం హయాంలో 70 శాతానికిపైగా పనులు పూర్తయ్యాయని.. చంద్రబాబు సీఎంగా ఉండి ఉంటే.. ఈ పాటికి పోలవరం ఎప్పుడో పూర్తి అయ్యేదని గుర్తు చేశారు.