CBN on Visakha road Incident రోడ్లపై గుంతల కారణంగా మనిషులు చనిపోతుంటే.. ప్రభుత్వం నిద్రపోతోందా? అని తెదేపా అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదాల తర్వాతైనా మేలుకోకపోవడం దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు. ఈనెల 4న విశాఖ వాసి సుబ్బారావు గుంత కారణంగా మరణించిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. ఈనెల 6న మళ్లీ అక్కడే ప్రమాదం జరిగి మరో వ్యక్తి గాయపడ్డారని మండిపడ్డారు. చివరకు సుబ్బారావు కుటుంబసభ్యులే రోడ్డుపై ఉన్న గుంతను పూడ్చారని చెప్పారు. ఇలాంటి నేతలకు ప్రజలు అధికారమిచ్చి.. పన్నుల రూపంలో డబ్బులిచ్చారని.. కానీ వాళ్లు చేయాల్సిన పని కూడా ప్రజలే చేయాల్సి రావడం బాధాకరమని అన్నారు.
ఇదీ జరిగింది:విశాఖపట్నానికి చెందిన రవ్వా సుబ్బారావు ఈ నెల 4న ద్విచక్రవాహనంపై విశాఖపట్నం డీఆర్‌ఎం కార్యాలయం నుంచి రైల్వేస్టేషన్‌కు వెళ్తూ.. రహదారి మధ్యలో ఉన్న గుంత వల్ల కిందపడిపోయాడు. ఆ సమయంలో సుబ్బారావు తలకు తీవ్ర గాయమైంది. రెండు రోజులపాటు ఆసుపత్రిలో చికిత్స పొందిన ఆయన.. ఈనెల 6న మృతి చెందారు. ఈ ప్రమాదం మరిచిపోక ముందే అదే గుంత వల్ల మరో యువకుడూ పడి తీవ్రంగా గాయపడ్డాడు.