'రైతుల ఆందోళనల అణచివేత.. ప్రభుత్వ మూర్ఖత్వం' - tdp chief chandrababu on state government over farmers protest for amaravathi
రైతుల ఆందోళనలపై ప్రభుత్వం స్పందించడం లేదంటూ తెదేపా అధినేత చంద్రబాబు ఆగ్రహించారు. రైతులపై కేసులు పెట్టడాన్ని తప్పుబట్టారు.
అమరావతి కోసం రైతులు చేస్తున్న ఆందోళనలపై.. ప్రభుత్వం పట్టింపు లేకుండా వ్యవహరిస్తోందని తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ''భూములు కోల్పోయి, 13 రోజులుగా నిద్రాహారాలు మాని వేలాది రాజధాని రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తుంటే పట్టించుకోని ప్రభుత్వం... పోలీసులతో అర్ధరాత్రి ఇళ్ళ గోడలు దూకించి రైతులను అరెస్ట్ చేయించడం ఏమిటి?'' అని ట్విటర్లో ప్రశ్నించారు. ''మహిళలు, వృద్దులను భయభ్రాంతులను చేయడం ఏమిటి? ఏమిటీ అమానుషత్వం? ఏమిటీ నిరంకుశధోరణి?'' అని నిలదీశారు. ''రాష్ట్రం కోసం భూములను త్యాగం చేసిన రైతులపై హత్యాయత్నం అభియోగాలా? వాళ్ళేమైనా మీలా గూండాలా? దొంగలా? జరిగిన ఘటనలకు పోలీసులు పెట్టిన సెక్షన్లకు పొంతన ఉందా? ఇంత చేతకాని, నిరంకుశ ప్రభుత్వాన్ని దేశం ఇంతవరకూ చూడలేదు. వేలాది పోలీసులను దించి రైతుల ఆందోళనలను అణిచేయాలనుకోవడం మూర్ఖత్వం'' అని చంద్రబాబు ట్వీట్ చేశారు.