రైతులకు కనీస మద్దతు ధర కొందరి దయాదాక్షిణ్యాలపై ఆధారపడి ఉండరాదని తెదేపా అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. కనీస మద్దతు ధర విధాన నిర్ణయానికే పరిమితం కారాదని, అది రైతులకు చట్టబద్ధమైన హక్కుగా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. రైతుల ప్రయోజనాలే పరమావధిగా పాలకుల నిర్ణయాలు ఉండాలని పేర్కొన్నారు. కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలపై దేశవ్యాప్తంగా రైతుల్లో, రైతు సంఘాల్లో ఉన్న అపోహల్ని తొలగించాలన్నారు. ‘‘ఆ మూడు చట్టాలపై రాజకీయ పార్టీలు, రాష్ట్ర ప్రభుత్వాలు, రైతుల సంఘాలు, రైతు ప్రతినిధులతో విస్తృతస్థాయిలో చర్చ జరగాలి. వారందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని, రైతులకు మేలుచేసే విధానాలు అమలుచేయాలి’’ అని చంద్రబాబు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ‘‘వ్యవసాయ చట్టాలపై లోక్‌సభలో చర్చ సందర్భంగా తెదేపా ముగ్గురు ఎంపీలతోనే తన గళాన్ని బలంగా వినిపించింది. 22 మంది ఎంపీలుండీ వైకాపా నోరు తెరవకపోవడం రైతు ద్రోహం. తెదేపా హయాంలో మద్దతు ధరకు అదనంగా బోనస్ చెల్లించి కొన్నాం. వైకాపా పాలనలో బోనస్ లేకపోగా, మద్దతు ధరే లభించక ఆందోళన చేసే పరిస్థితి నెలకొనడం దురదృష్టకరం’’ అని విమర్శించారు.
దళారుల ఇష్టారాజ్యానికి వదిలేయకూడదు
రైతుల నుంచి పంట కొనుగోళ్లను దళారుల ఇష్టారాజ్యానికి వదిలేయకూడదని చంద్రబాబు తెలిపారు. పంట ఉత్పత్తుల కొనుగోలు ధరల్లో హెచ్చుతగ్గులపై ప్రభుత్వానికి తగిన తనిఖీ, నియంత్రణ వ్యవస్థలు ఉండాలన్నారు. ‘‘రైతులు, కొనుగోలుదారుల మధ్య అనుసంధాన వేదికగా నిలిచేలా మార్కెట్ యార్డులను బలోపేతం చేయాల్సిన బాధ్యత నుంచి ప్రభుత్వం వైదొలగరాదు. రైతు బజార్ల వ్యవస్థను ఆధునికీకరిస్తే రైతులు, వినియోగదారులకు మేలు. దేశవ్యాప్తంగా నల్లబజారు విక్రయాలకు, దళారుల దుశ్చర్యలకు అడ్డుకట్ట వేసేలా వ్యవస్థను బలోపేతం చేయాలి’’ అని ఆయన పేర్కొన్నారు. రైతుల ప్రయోజనాల పరిరక్షణకు తెదేపా ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు.