ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Chandrababu: "రాష్ట్రంలో ఆడపిల్లలకు రక్షణ లేదని మరోసారి రుజువైంది"

నెల్లూరులో బాలికపై దాడిని తెదేపా అధినేత చంద్రబాబు​ తీవ్రంగా ఖండించారు. ఇంట్లో ఉన్నప్పటికీ ఏపీలో ఆడపిల్లల మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందనేది నెల్లూరు ఘటనతో మరోసారి రుజువైందని చంద్రబాబు ధ్వజమెత్తారు. బాలికపై ఘాతుకానికి ఒడిగట్టిన నిందితుడికి కఠిన శిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాలికకు మెరుగైన వైద్యం అందించి, కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలబడాలన్నారు.

Chandrababu
చంద్రబాబు

By

Published : Sep 6, 2022, 3:03 PM IST

ఇంట్లో ఉన్నప్పటికీ ఏపీలో ఆడపిల్లల మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందనేది నెల్లూరు ఘటనతో మరోసారి రుజువైందని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. అత్యాచార ఘటనల్లో నిందితులకు కఠిన శిక్షలు అమలుచేస్తే ఇలాంటి నేరాలు పునరావృతం కావని మండిపడ్డారు. వెంకటాచలం మండలంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న 14 ఏళ్ల బాలికపై ఒక దుర్మార్గుడు అత్యాచారానికి ప్రయత్నించి...ఆమె ప్రతిఘటించటంతో నోట్లో, ముఖం మీద యాసిడ్‌ పోసి..ఆపై గొంతు కోసిన ఘటన దిగ్భ్రాంతిని కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దుశ్చర్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.

ప్రభుత్వం కానీ, పోలీసులు కానీ నేరాల నియంత్రణకు చిత్తశుద్ధితో పనిచేయకపోవటంతోనే నేరగాళ్లు విచ్చలవిడితనం పెరిగిపోయిందని చంద్రబాబు దుయ్యబట్టారు. వైకాపా ప్రభుత్వం వచ్చాక ఏపీలో నేరాల రేటు పెరిగిందని జాతీయ గణాంకాలు ఇటీవలే చెప్పాయన్న ఆయన... నేరం చేసిన వైకాపా రౌడీలను వెనకేసుకు రావడం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన ప్రతి ఒక్కరిపైనా అక్రమకేసులు పెట్టడంలో ఉన్న శ్రద్ధ... శాంతి భద్రతలు కాపాడటంలో ఎందుకు లేదని నిలదీశారు. బాలికపై ఘాతుకానికి ఒడిగట్టిన నిందితుడికి కఠిన శిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాలికకు మెరుగైన వైద్యం అందించి, కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలబడాలన్నారు.

నెల్లూరు జిల్లా వెంక‌టాచ‌లం మండ‌లంలో 14 ఏళ్ల బాలిక‌పై లైంగిక దాడికి యత్నించిన నాగరాజు... వైకాపా కార్యకర్తేనని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. వైకాపా కార్యక‌ర్తను ఎంపీ గోరంట్ల మాధవ్​ను రక్షించినట్లే రక్షించేందుకు పోలీసులు ఇప్పుడేం క‌ట్టుక‌థ అల్లుతారోనని విమర్శలు గుప్పించారు. జ‌గ‌న్‌రెడ్డి సీఎం కావ‌డంతోనే నేర‌స్తులు, దోపిడీదారులు, రేపిస్టులు... ఇది త‌మ రాజ్యమ‌న్నట్టు చెల‌రేగిపోతున్నారని మండిపడ్డారు. వైకాపా దురాగ‌తాల‌కు అడ్డుక‌ట్ట ప‌డ‌క‌పోతే రాష్ట్రంలో ఆడ‌పిల్లలు, మ‌హిళ‌లు క‌నుమ‌రుగ‌య్యే ప్రమాదం ఉందన్నారు. ఆవు చేలో మేస్తే, దూడ గ‌ట్టున మేస్తుందా అన్న రీతిలో జ‌గ‌న్‌రెడ్డి త‌ల్లిని త‌రిమేసి, చెల్లిని గెంటేసి, బాబాయ్‌ని చంపేస్తే.. వైకాపా కార్యక‌ర్తలు మాన‌వ‌త్వానికే మాయ‌నిమ‌చ్చలా ఊరుమీద ప‌డి బాలిక‌ల‌పై దాడుల‌కి తెగ‌బ‌డుతున్నారని లోకేశ్​ దుయ్యబట్టారు.

ఇదీ జరిగింది:Acid attack on Minor: నెల్లూరులో కామాంధుడు చెలరేగిపోయాడు. ఓ ఇంట్లో ఒంటరిగా ఉన్న 14 ఏళ్ల బాలికపై అత్యాచారానికి ప్రయత్నించాడు. ఆమె ప్రతిఘటించటంతో నోట్లో, ముఖంపై యాసిడ్‌ పోసి.. ఆపై గొంతు కోసి పరారయ్యాడు. అత్యంత దారుణమైన ఈ ఘటన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని ఓ గ్రామంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఈ బాలిక నెల్లూరు నగరానికి సమీపంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. కుటుంబ సభ్యులు సోమవారం సాయంత్రం పని మీద బయటకు వెళ్లారు. బాలిక ఇంట్లో ఒంటరిగా ఉందని గుర్తించిన నాగరాజు అనే వ్యక్తి ఆ ఇంట్లోకి ప్రవేశించాడు. ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. ఆందోళన చెందిన ఆమె పక్కనే ఉన్న వాష్‌రూంలోకి వెళ్లి తలుపులు వేసుకునే ప్రయత్నం చేసింది. సదరు వ్యక్తి తలుపులు బలంగా తోసుకుని లోనికి వెళ్లాడు. అక్కడ మరోమారు అత్యాచారానికి ప్రయత్నించటంతో తీవ్రంగా ప్రతిఘటించింది. దీంతో నిందితుడు ఆమె నోట్లో, ముఖంపై యాసిడ్‌ పోశాడు. ఈ బాధ తట్టుకోలేక ఆమె పెద్దగా కేకలు వేయటంతో.. నిందితుడు కత్తితో గొంతు కోసి పరారయ్యాడు. చుట్టుపక్కల ఇళ్లవారు వచ్చిచూడగా బాలిక రక్తపు మడుగులో పడి ఉంది. వెంటనే తల్లిదండ్రులకు సమాచారం అందించారు. వారు వచ్చి బాధితురాలిని నెల్లూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మెరుగైన వైద్యం కోసం నెల్లూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. బాలికపై యాసిడ్ దాడి చేసి, గొంతు కోసిన మేనమామ నాగరాజుని వెంకటాచలం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details