వైకాపా ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. రివర్స్ టెండరింగ్ పేరుతో కమీషన్లు దండుకుంటూ.. రైతులకు సాగు నీరివ్వట్లేదని ఆరోపించారు. భగీరథ జయంతి సందర్భంగా భవన నిర్మాణ కార్మికులకు, కర్షకులకు శుభాకాంక్షలు చెప్పారు.
రివర్స్ టెండరింగ్ పేరిట దోపిడి: చంద్రబాబు - cbn bhageeradha wishes
భవన నిర్మాణ కార్మికులకు తెదేపా అధినేత చంద్రబాబు భగీరథ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. వైకాపా ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.

రాష్ట్రంలోని సాగు నీటి ప్రాజెక్టులను త్వరిత గతిన పూర్తి చేయటంతోపాటు కొవిడ్ కారణంగా పనులు లేక ఇబ్బంది పడుతున్న భవన నిర్మాణ కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. "భవన నిర్మాణ కార్మికుల కులదైవమైన భగీరథుడు జయంతిని తెదేపా ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వేడుకగా ఘనంగా నిర్వహించాం. వైకాపా ప్రభుత్వం దీనిని నిర్లక్ష్యం చేయటంతో పాటు ఇసుక కొరత సృష్టించి భవన నిర్మాణ కార్మికుల్ని రోడ్డున పడేసింది. భగీరథుడికి నివాళిగానే 5ఏళ్లలో రూ.70వేల కోట్లు ప్రాజెక్టుల నిర్మాణానికి ఖర్చు చేసి 23ప్రాజెక్టులను పూర్తి చేశాం. పోలవరం ప్రాజెక్టు పనులు 72శాతం పూర్తి చేయటంతో పాటు రికార్డు వ్యవధిలో పట్టిసీమ పూర్తిచేసి, మరో 69ప్రాజెక్టులను ప్రాధాన్యతా క్రమంలో చేపట్టాం." అని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
ఇదీ చదవండి:రఘురామ కేసులో ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం.. కోర్టు ధిక్కరణ నోటీసుల జారీకి ఆదేశం!