విశాఖలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును వైకాపా శ్రేణులు అడ్డుకోవడంపై రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తాయి.
శ్రీకాకుళం
రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో గురువారం సాయంత్రం నిరసన ప్రదర్శన జరిగింది. మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఆధ్వర్యంలో జరిగిన ప్రదర్శనలో ప్రభుత్వానికి, డీజీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటూ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
చంద్రబాబు అరెస్ట్‌పై శ్రీకాకుళం ఏడు రోడ్ల కూడలి వద్ద తెదేపా కార్యకర్తలు ధర్నాకు దిగారు. చంద్రబాబుకు జరిగిన అవమానాన్ని ఖండిస్తున్నామన్నారు.
విజయనగరం
తెదేపా అధినేత చంద్రబాబు అక్రమ అరెస్ట్‌పై భోగాపురం జాతీయ రహదారి వద్ద నిరసనలు మిన్నంటాయి. మండలంలోని నేతలు, కార్యకర్తలు పాల్గొని తక్షణమే ఆయనను విడిపించాలని డిమాండ్ చేశారు. కుళ్లు రాజకీయాలకు ప్రజలే తప్పకుండా బుద్ధి చెప్తారంటూ నినాదాలు చేశారు. ఈ నిరసనలో ట్రాఫిక్ సుమారు రెండు కిలోమీటర్ల మేర స్తంభించింది. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బంగార్రాజు, పడాల శ్రీనివాసరావు ఇతర నాయకులు పాల్గొన్నారు.
ఎస్. కోటలో చంద్రబాబు నిర్బంధానికి నిరసనగా స్థానికి తెదేపా శ్రేణులు రాస్తారోకో కార్యక్రమం చేపట్టారు. వేలాది మంది కార్యకర్తలు విశాఖ అరకు రోడ్డుపై బైఠాయించారు. రంగంలోకి దిగిన పోలీసులు విరమింప చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు.
తూర్పుగోదావరి
చంద్రబాబును అక్రమ నిర్బంధం చేసినందుకు జగ్గంపేటలో జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. జెడ్.ప్లస్ కేటగిరీ భద్రత ఉన్న మాజీ ముఖ్యమంత్రిని విశాఖపట్నం వెళ్ళటానికి సరైన చర్యలు తీసుకోని పోలీసు వారు ఆత్మ విమర్శ చేసుకోవాలని ఆయన అన్నారు.
విశాఖ విమానాశ్రయంలో మాజీ ముఖ్యమంత్రిని అడ్డుకున్నందుకు నిరసనగా ప్రత్తిపాడు నియోజకవర్గ తెదేపా శ్రేణులు ర్యాలీ చేశారు. ఈ కార్యక్రమం నియోజక ఇంఛార్జ్ వరుపుల రాజా ఆధ్వర్యంలో నిర్వహించారు.
పశ్చిమగోదావరి
చైతన్య యాత్రలో భాగంగా ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో చంద్రబాబు పర్యటనకు వచ్చిన స్పందన చూసి వైకాపా శ్రేణులలో వణుకు పుట్టిందనడంలో సందేహం లేదని మాజీ శాసనసభ్యులు రాధాకృష్ణ పేర్కొన్నారు. ప్రతిపక్ష నేత పర్యటనకు అనుమతించిన పోలీసులే అడ్డుకోవడం దుర్మార్గపు చర్యగా అభివర్ణించారు. పోలీసులు ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.
పాలకొల్లు గాంధీ బొమ్మ సెంటర్ వద్ద తెదేపా నాయకులు నిరసన వ్యక్తం చేశారు. శాసనసభ్యులు నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
కృష్ణా
చంద్రబాబు తలపెట్టిన ప్రజా చైతన్య యాత్ర విశాఖలో వైకాపా కార్యకర్తలు అడ్డుకోవడంపై నిరసన తెలియజేస్తూ జగ్గయ్యపేట మండలం అన్నవరం గ్రామంలో కొవ్వొత్తలు ప్రదర్శన నిర్వహించారు.
తెదేపా అధినేతపై అరెస్ట్‌ను నిరసిస్తూ విజయవాడలో తెదేపా కార్యకర్తలు ఆందోళన బాట పట్టారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు.
గుంటూరు
గుంటూరు లాడ్జి సెంటర్ అంబెడ్కర్ కూడలి వద్ద తెదేపా నేతలు బైఠాయించి పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. చంద్రబాబు పర్యటనను అడ్డుకోడం హేయమైన చర్యగా అభివర్ణించారు. తక్షణమే చంద్రబాబును విడుదల చేయాలనీ ఎమ్మెల్సీ రామకృష్ణ డిమాండ్ చేశారు. తెనాలి మార్కెట్ సెంటర్ వద్ద తెదేపా ఆధ్వర్యంలో నిరసనకు దిగారు. తాటికొండ నియోజకవర్గం మేడికొండూరు ప్రధాన రహదారిపై తెదేపా నాయకులు ధర్నా చేశారు. మాజీ ముఖ్యమంత్రిపై చెప్పులు, రాళ్లు విసరడం సరికాదంటూ మండిపడ్డారు.
నెల్లూరు
మాజీ ముఖ్యమంత్రిని వైకాపా గూండాలు అడ్డుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధమని నెల్లూరు నగర పార్టీ నాయకుడు కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరులో పార్టీ కార్యలయం నుంచి గాంధీ బొమ్మ వరకు ర్యాలీ నిర్వహించారు.
కర్నూలు
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు సోమప్ప కూడలిలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చంద్రబాబును అడ్డుకోవడం దుర్మార్గమైన చర్యంటూ తెదేపా శ్రేణులు అన్నారు.
అనంతపురం
విశాఖలో తెదేపా అధినేతను వైకాపా కార్యకర్తలు అడ్డుకున్న అంశాన్ని ఖండిస్తూ అనంతపురం క్లాక్ టవర్ వద్ద తెదేపా నాయకులు నల్లజెండాలతో నిరసన తెలిపారు. అక్రమ అరెస్ట్ చేసిన చంద్రబాబను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో శాంతి బాధ్యతలు పూర్తిగా క్షీణించిపోయాయని కళ్యాణదుర్గం నియోజకవర్గం పార్టీ ఇన్ఛార్జ్ ఉమామహేశ్వర నాయుడు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని బర్త్‌రఫ్ చేసి శాంతి భద్రతలను పరిరక్షించాలని డిమాండ్ చేశారు.
చిత్తూరు
చంద్రబాబు అరెస్ట్‌పై శ్రీకాళహస్తిలో తెలుగు తమ్ముళ్లు భగ్గుమన్నారు. పార్టీ కార్యాలయం నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు ర్యాలీగా నిర్వహించారు. విశాఖ పర్యటనపై పదిరోజులకు ముందు అనుమతి కోరినప్పటికీ పర్యటనను అడ్డుకుంటూ పోలీసుల ముందస్తుగా అరెస్ట్ చేయడం తగదని ఆవేదన వ్యక్తం చేశారు.
చిత్తూరులో ప్రతిపక్షనేత అరెస్ట్‌ను ఖండిస్తూ తెదేపా శ్రేణులు రోడ్డెక్కారు. గాంధీ విగ్రహం వద్ద రాస్తారోకో నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం దౌర్జన్యాలను ప్రజలందరూ గమనిస్తున్నారని త్వరలోనే తగిన గుణపాఠం చెప్పే రోజులు దగ్గర పడ్డాయని శాసనమండలి సభ్యులు దొరబాబు హెచ్చరించారు. రాష్ట్రంలో పరిపాలన అస్తవ్యస్తంగా ఉందని... ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు.
విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో చంద్రబాబుపై జరిగన ఘటనను నిరసిస్తూ కుప్పంలో తెదేపా శ్రేణులు నిరసన కార్యక్రమం చేపట్టారు. శాంతిపురం, కుప్పం, రామకుప్పం, గుడిపల్లి మండలాల్లోని నేతలు, కార్యకర్తలు రాస్తారోకో చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే ఆయన్ను విడుదల చేయాల్సిందిగా డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి :
విశాఖ పర్యటనలో చంద్రబాబు అరెస్టు