రాష్ట్రంలో పేదరికం పోవాలన్నా, సామాన్య ప్రజల కష్టాలు తీరాలన్నా తెదేపా అధికారంలోకి రావాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. రైతులకు, పేదలకు న్యాయం చేసేది తెలుగుదేశమేనని స్పష్టం చేశారు. ‘మీరు ఎక్కడున్నా జన్మభూమి అభివృద్ధికి చేస్తున్న కృషి మరవలేనిది. రాబోయే రోజుల్లోనూ పుట్టిన ప్రాంత అభివృద్ధికి పునరంకింతం కావాలి. తెదేపా బలోపేతానికి సహకారం అందించాలి’ అని వివిధ దేశాల్లోని తెలుగువారికి విజ్ఞప్తి చేశారు. తెదేపా 40 వసంతాల వేడుకలను 40 దేశాల్లోని 200 నగరాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు వారితో వీడియో సమావేశం ద్వారా మాట్లాడారు. ‘ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు హైదరాబాద్‌ను నాలెడ్జి హబ్‌గా తయారు చేసేందుకు విమానాశ్రయం, ఔటర్ రింగ్‌రోడ్డు తదితర మౌలిక సౌకర్యాలను కల్పించాం. దీంతో సంపద సృష్టి జరిగింది. రైతులు, పేదల పిల్లలు కూడా ప్రపంచం నలుమూలలకు వెళ్లి స్థిరపడ్డారు’ అని పేర్కొన్నారు. ‘రాష్ట్ర విభజన తర్వాత అమరావతి నగర నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. తెలుగుజాతి పూర్వవైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పాలని పనిచేశా. దేశ విదేశాల్లోని ఎంతోమంది చేయూత అందించారు. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం వచ్చాక అమరావతితో పాటు అన్ని రంగాలనూ ధ్వంసం చేసే కార్యక్రమాలు చేపట్టింది. దీంతో రాష్ట్రం ఉనికినే కోల్పోయే పరిస్థితి తలెత్తింది’ అని విమర్శించారు. ‘తెలుగువారు ఎక్కడున్నా మాతృభూమిపై ఉండే ప్రేమ వెలకట్టలేనిది. సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుతున్నారు. ఎప్పుడు, ఏ అవసరం వచ్చినా గ్రామాల అభివృద్ధికి చేయూతనిస్తున్నారు’ అని ప్రశంసించారు.
తెలుగుదేశం పార్టీ 40 వసంతాల వేడుకలను అమెరికాలో ఘనంగా నిర్వహించారు. నార్త్ కెరొలినా రాష్ట్రంలోని షార్లెట్ నగరంలో తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు సమావేశమై ఎన్నారై తెదేపా షార్లెట్ చాప్టర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకూ నెలకొన్న పరిస్థితులపై తమ అనుభవాలను గుర్తు చేసుకున్నారు. తెలుగుదేశం పార్టీ 40వసంతాల వేడుక సందర్భంగా మెల్‌బోర్న్‌లో పార్టీ అభిమానులు ర్యాలీ నిర్వహించి.. జై తెదేపా ఆకృతిని కార్లతో ప్రదర్శించి తమ అభిమానాన్ని చాటారు.