Tax revenue: తెలంగాణలో కొత్త ఆర్థిక సంవత్సరంలో మొదటి రెండు నెలల్లో రాష్ట్ర ప్రభుత్వానికి పన్నుఆదాయం బాగానే ఉంది. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్‌కు ప్రభుత్వం అందించిన వివరాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో పన్ను ఆదాయ అంచనా రూ.లక్షా 26వేల కోట్లు కాగా.. మే నెలాఖరు వరకు రూ.18,751 కోట్ల ఖజానాకు సమకూరాయి. ఇది ప్రతిపాదిత పన్నుఆదాయంలో 14.81శాతంగా ఉంది.
ఏప్రిల్ నెలలో ప్రభుత్వానికి పన్ను ఆదాయం రూ.9291 కోట్లు రాగా.. మే నెలలో స్వల్పంగా పెరిగి రూ.9459 కోట్లు పన్నుల ద్వారా సమకూరాయి. జీఎస్టీ ద్వారా రూ.6223కోట్లు, అమ్మకం పన్ను ద్వారా రూ.4872కోట్లు, స్టాంపులు-రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.2586 కోట్లు, ఎక్సైజ్ డ్యూటీ ద్వారా రూ.2599 కోట్ల రూపాయలు సమకూరాయి. ఇతర పన్నుల రూపంలో మరో రూ.1274 కోట్లు రాగా.. కేంద్ర పన్నుల్లో వాటాగా రాష్ట్రానికి కేవలం రూ.1195 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చాయి.
గ్రాంట్ల రూపంలో కేంద్రం నుంచి కేవలం రూ.291 కోట్లు మాత్రమే సమకూరాయి. పన్నేతర ఆదాయం రూ.913 కోట్లు సమకూరింది. రిజర్వ్ బ్యాంకు నుంచి బాండ్ల వేలం ద్వారా తీసుకునే బహిరంగ మార్కెట్ రుణాలకు కేంద్రం అనుమతి ఇవ్వకపోవడంతో మే నెలాఖరు వరకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి రుణం తీసుకోలేదు. జూన్‌లో మాత్రం ఇప్పటికే రూ.4000కోట్ల రుణం తీసుకోగా.. మరో రూ.3000 కోట్లను అప్పు ద్వారా సమకూర్చుకోనుంది.