ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ బడుల్లో మౌలిక వసతుల కల్పనకు టాటా ట్రస్టు ఆసక్తి - సర్కారు బడుల మరమ్మతులు చేయనున్న టాటా ట్రస్టు

తెలంగాణలోని సర్కారు పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని టాటా ట్రస్టు భావిస్తోంది. ఈ విషయమై ట్రస్టు ప్రతినిధులు ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని, పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేతో చర్చించారు. త్వరలో విద్యాశాఖతో ఒప్పందం కుదుర్చుకోనున్నారు.

tata-trust-will-agreement-with-telangana-education-department-for-government-schools-renovation
సర్కారు బడుల్లో మౌలిక వసతుల దిశగా టాటా ట్రస్టు

By

Published : Dec 26, 2020, 2:20 PM IST

తెలంగాణలోని సర్కారు పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించి వాటి రూపు రేఖలు మార్చేందుకు టాటా ట్రస్టు ముందుకొచ్చింది. ముఖ్యంగా జీహెచ్‌ఎంసీ, చుట్టుపక్కల ఎంపిక చేసిన బడుల్లో పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించాలని భావిస్తోంది. ఇటీవలే ముంబయి నుంచి వచ్చిన ట్రస్టు ప్రతినిధులు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిసి చర్చించారు. పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేననూ కలిసి పాఠశాలల పరిస్థితిని తెలుసుకోవడమే కాకుండా హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల పరిధిలోని పలు పాఠశాలలను పరిశీలించారు.
సకల సౌకర్యాలు కల్పించేలా..
కేవలం భవనాలు, తరగతి గదులు, ప్రహరీ గోడలు నిర్మించడం కాకుండా ఫర్నీచర్‌తోపాటు పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు గ్రంథాలయం, ప్రయోగశాలలు ఏర్పాటు చేయడం ట్రస్టు లక్ష్యంగా ప్రతినిధులు చెప్పినట్లు విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. కొద్ది సంఖ్యలో బడులను ఎంచుకున్నా వాటిని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలని వారు భావిస్తున్నట్లు చెబుతున్నారు. ‘రాజ్‌భవన్‌ ఉన్నత పాఠశాలలో ఒకప్పుడు 500 మంది విద్యార్థులు ఉండే వారు. అందులో రూ.3 కోట్లతో కొత్త భవనాలు నిర్మించి.. అన్ని సౌకర్యాలు కల్పించడంతోపాటు పూర్తిస్థాయిలో ఉపాధ్యాయులను నియమించిన తర్వాత పిల్లల సంఖ్య 1,300కి పెరిగిందని అధికారులు ట్రస్టు ప్రతినిధుల దృష్టికి తెచ్చారు. ఈ క్రమంలో దాదాపు రూ.10 కోట్ల వరకు ఖర్చు చేసేందుకు వారు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇటీవల వరదలతో దెబ్బతిన్న పాఠశాలలకు ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉందని సమాచారం.
5 వేల మంది ఉపాధ్యాయులకు టీసీఎస్‌ శిక్షణ
ఇప్పటికే ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ తదితర రాష్ట్రాల్లో పాఠశాలల అభివృద్ధిని ఈ ట్రస్టు చేపట్టింది. ఒడిశాలో పాఠశాల విద్యార్థుల కోసం మొబైల్‌ వ్యాన్‌ ల్యాబ్‌లనూ నడుపుతోంది. త్వరలోనే టాటా ట్రస్టు తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖతో ఒప్పందం కుదుర్చుకొనే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రతిఏటా ఈ సంస్థ దేశంలో రూ. 1,200 కోట్లను వివిధ సామాజిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తోంది. టాటా గ్రూపునకు చెందిన టీసీఎస్‌ ఇప్పటికే కార్పొరేట్‌ సామాజిక బాధ్యత కింద తెలంగాణలోని 5 వేల మంది ఉపాధ్యాయులకు ఉచితంగా సాంకేతికతలపై శిక్షణ ఇచ్చేందుకు విద్యాశాఖతో ఒప్పందం కుదుర్చుకుంది.

ABOUT THE AUTHOR

...view details