తణుకు మాజీ ఎమ్మెల్యే వై.టి.రాజా కన్నుమూశారు. అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. ఇటీవల కరోనా నుంచి కోలుకున్న వై.టి.రాజా...హైదరాబాద్‌లో వైద్య పరీక్షలకు వెళ్లి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్నారు.1999-2004 వరకు తణుకు ఎమ్మెల్యేగా రాజా పనిచేశారు. తణుకు పురపాలక సంఘం ఉపాధ్యక్షులుగా పనిచేశారు. తణుకు కన్జ్యూమర్ కో-ఆపరేటివ్ స్టోర్స్ అధ్యక్షుడిగా కూడా ఆయన సేవలందించారు.
తణుకులో జయలక్ష్మీ ఫెర్టిలైజర్స్, విశాఖపట్నంలో ప్రత్యూష కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నారు. కె. ఇల్లిందలపర్రు గ్రామంలో ప్రవాసాంధ్రులతో కలిసి ఏర్పాటు చేసిన డాక్టర్స్ ఆర్గానిక్ కెమికల్స్ సంస్థకు చాలా కాలం మేనేజింగ్ డైరెక్టర్గా పని చేశారు. ఆయన మృతి పట్ల తెలుగు దేశం పార్టీ వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
రాజా మృతి పట్ల చంద్రబాబు, లోకేశ్, అచ్చెన్న సంతాపం
తణుకు మాజీ ఎమ్మెల్యే వై.టి.రాజా మృతి పట్ల తెదేపా అధినేత చంద్రబాబు, తెదేపా జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేశ్, తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు సంతాపం తెలియజేశారు. తణుకు ప్రాంత అభివృద్దితో పాటు జిల్లా అభివృద్దికి వై.టి. రాజా పరితపించారని చంద్రబాబు కొనియడారు. శాసన సభ్యునిగా ఆయన చేసిన కృషి మరువలేనిదని...రాజా మృతి పశ్చిమ గోదావరి జిల్లాకు, తెలుగుదేశం పార్టీకి తీరని లోటన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు.
రాజా చేసిన కృషి ప్రజల మనసులో చిరస్థాయిగా నిలిచిపోతుందని జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ కీర్తించారు. వై.టి. రాజా అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్న రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్న తెలిపారు. తణుకు ఎమ్మెల్యేగా, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యునిగా నియోజకవర్గ అభివృద్ధిలో ఆయన పాత్ర చిరస్మరనీయమని గుర్తుచేసుకున్నారు. రాజా కుటుంబ సభ్యులకు ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు, ఇతర తెలుగుదేశం పార్టీ జిల్లా నేతలు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఇదీ చదవండి:
అభిరుచి ఉంటే.. ఎంతైనా ఎదగొచ్చు.. ఈ ప్రయాణం చూడండి!