ముఖ్యమంత్రి జగన్‌కు తమిళనాడు సీఎం లేఖ - tamil nadu cm letter to ap cm
18:01 August 13
ఆ ప్రాజెక్టులను ఆపాలని కోరిన స్టాలిన్
కుశస్థలి నదిపై జలాశయాల నిర్మాణాలు చేపట్టవద్దంటూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని తమిళనాడు సీఎం స్టాలిన్ కోరారు. ఈ మేరకు శనివారం లేఖ రాశారు. ‘కుశస్థలి నదిపై చిత్తూరు జిల్లాలో 2చోట్ల రిజర్వాయర్ల నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం ఆమోదించినట్లు తెలిసింది. అదే జరిగితే చెన్నై, పరిసర ప్రాంతాల ప్రజల తాగు, సాగు నీటిపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా చెన్నైకు తాగునీటి వనరుగా ఉన్న పూండి రిజర్వాయరు ఇన్‌ఫ్లోపై ప్రభావం చూపుతుంది. అంతర్రాష్ట్ర నది కావడంతో దిగువ రాష్ట్ర అనుమతి లేకుండా కుశస్థలి నదిపై ఎగువ రాష్ట్రం ఎలాంటి కొత్త ప్రాజెక్టు నిర్మాణానికి ప్రణాళిక రూపొందించడం, ఆమోదించడం, నిర్మాణం చేపట్టడం సాధ్యం కాదు. నది పరీవాహక ప్రాంతంలో కొత్త ప్రాజెక్టులు చేపట్టొద్దని ప్రభుత్వ అధికారులను ఆదేశించాలి. సమస్య సున్నితత్వాన్ని పరిగణనలోకి తీసుకొని తక్షణ వ్యక్తిగత జోక్యాన్ని అభ్యర్థిస్తున్నా’ అని లేఖలో పేర్కొన్నారు.
దశాబ్దం క్రితమే ప్రాజెక్టులకు అంతర్రాష్ట్ర ఆమోదం !:కుశస్థలి నదిపై కార్వేటినగరం మండలం కత్తెరపల్లి, నగరి మండలం ముక్కలకండ్రిగ సమీపంలో నిర్మించాలని ప్రతిపాదించిన రెండు ప్రాజెక్టుల పనులను విరమించుకోవాలని తమిళనాడు సీఎం స్టాలిన్ లేఖ రాసిన నేపథ్యంలో ఇప్పుడు ఏం చేయాలని జలవనరుల శాఖ అధికారులు సందిగ్ధంలో పడ్డారు. రెండేళ్లుగా భారీ వర్షాలు పడుతుండటంతో సుమారు 10 టీఎంసీల వరకు నీరు వృథాగా తమిళనాడుకు వెళ్లింది. దీంతో కార్వేటినగరం, నగరిలో ప్రాజెక్టులు నిర్మిస్తే ఇక్కడి రైతులకు ఉపయోగంగా ఉంటుందని అధికారులు అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి పంపారు. ఒక్కోటి 200 ఎంసీఎఫ్‌టీల సామర్థ్యంతో ముక్కలకండ్రిగలో రూ.78 కోట్లు, కత్తెరపల్లిలో రూ.85 కోట్లతో నూతనంగా రెండు ప్రాజెక్టుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దశాబ్దం కిందటే ఈ రెండింటికీ అంతర్రాష్ట్ర అనుమతులు వచ్చినట్లు జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు. వీటన్నింటినీ పరిశీలించిన తర్వాతే ప్రాజెక్టుల నిర్మాణానికి అడుగులు వేసినట్లు సమాచారం. తాజాగా తమిళనాడు సీఎం లేఖతో.. ప్రాజెక్టుల భవితవ్యం ఏమిటని జలవనరుల శాఖలో చర్చ జరుగుతోంది.
ఇవీ చదవండి :
- గోరంట్ల మాధవ్ వీడియో నిజమైనదేనని చెప్పిన ఫోరెన్సిక్ రిపోర్ట్
- Iron locker ఇల్లు కూలుస్తుండగా గోడ నుంచి బయటపడ్డ ఐరన్ లాకర్